ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వందల మంది ఉపాధి కూలీలు, కార్మికులపై లాక్ డౌన్ ప్రభావం చూపుతోంది. పశ్చిమబెంగాల్ నుంచి 500 మంది వరకు ఉపాధి కోసం వచ్చి విజయవాడలోని క్రీస్తురాజపురం మసీదు ప్రాంతంలో ఉంటున్నారు. వీరంతా మగ్గం, బట్టలు కుట్టడం, ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న వీరంతా.... లాక్ డౌన్ కారణంగా వారి వారి ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయారు. ఓ వైపు పనులు నిలిచిపోవడం....మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో తినేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఉపాధి కోసం పిల్లాపాపలతో కలిసి వందల కిలోమీటర్లు దాటుకుని వచ్చామని....లాక్ డౌన్ విధించడంతో తమ యజమాని ఫోన్లోనూ అందుబాటులోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇక్కడ ఎలాంటి ఆధారం లేదని....ఆధార్, రేషన్ కార్డు అన్నీ స్వస్థలంలో ఉండటంతో....ఇక్కడి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని వాపోతున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి పెడితే తప్ప....మరో ఆసరా లేదని....ఒకరోజు తింటే రెండు రోజులు పస్తుండాల్సి వస్తోందంటున్నారు. తమకు ఆహారం అందించడమో లేక తమ స్వస్థలాలకు పంపించడమో చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వీరంతా....తమను స్వస్థలానికి పంపేందుకు ఇక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకపోతే....ఈ నిర్బంధం ముగిసే వరకు తమకు ఆహారం అందించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: