కాస్త ఎండగా ఉన్నప్పుడు పుచ్చకాయ ముక్క తిని ఉపశమనం పొందడం మనకు అలవాటే. అలాగే ఎండల వల్ల ముఖ చర్మం పొడిబారినా, ట్యాన్‌తో కాస్త రంగు తగ్గినా, మచ్చలు ఎక్కువగా ఉన్నా.. ఈ రసాన్ని ఉపయోగిస్తే చక్కని ఫలితం ఉంటుంది.
క్లెన్సర్‌లా
పావుకప్పు పుచ్చకాయ రసం తీసుకుని దాంట్లో దూది ఉండను ముంచాలి. దాంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మురికి పోయి చక్కగా మెరుస్తుంది. అలాగే రెండు చెంచాల పుచ్చకాయ రసంలో చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా ఆరిన తర్వాత కడిగేయాలి. తరచూ ఇలాచేస్తే ముఖ చర్మం మెరుస్తుంది.
టోనర్‌లా
కప్పు పుచ్చకాయ ముక్కల్లో నాలుగైదు కమలా తొనలు వేసి గుజ్జులా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చన్నీటితో కడిగేయాలి. ఫ్రిజ్‌లో పెడితే ఇది నాలుగైదు రోజులపాటు నిల్వ ఉంటుంది కూడా.
మచ్చలకు మందులా
ముఖం మీద మచ్చలున్నా, చర్మం కమిలినా ఇలా చేసి చూడొచ్చు. పుచ్చకాయ రసంలో గులాబీనీరు కలిపి ఐస్‌క్యూబ్స్ తయారుచేయాలి. వీటితో ముఖాన్ని రుద్దితే.. మచ్చలు తగ్గడంతోపాటు ముఖ చర్మం నిగారింపునూ సంతరించుకుంటుంది.
ఇదీ చదవండి