Students Beer Party: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని బీసీ బాలుర హాస్టల్లో విద్యార్థులు మాంసం, మద్యంతో విందు చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హాస్టల్లోని పదో తరగతి విద్యార్థులు, కింది తరగతి విద్యార్థులు కలిసి ఏప్రిల్ 17న రాత్రి వీడ్కోలు పార్టీ చేసుకుంటామని వార్డెన్‌ను కోరారు. పదోతరగతి పరీక్షలు ముగిసిన తర్వాత.. పిల్లలు విడిపోతారు కదా అని భావించిన వార్డెన్.. వారి కోరికను మన్నించారు. వంటమనిషి విజయ చేత రాత్రి పూట భోజనంలోకి చికెన్ కూడా చేయించారు. విద్యార్థులందరూ.. భోజనం చేసిన తర్వాత సుమారు తొమ్మిదిన్నర సమయంలో వార్డెన్ ఇంటికి వెళ్లిపోయారు. వంటమనిషి విజయ.. హాస్టల్లోనే పక్కన గదిలో పడుకున్నారు.
అంతా ఓకే అనుకున్న తర్వాత.. మందు పార్టీకి స్కెచ్ వేశారు విద్యార్థులు. బయట ఉన్న మిత్రులతో హాస్టల్ వెనుక నుంచి బీర్ బాటిల్స్ తెప్పించుకున్నారు. ఆ తర్వాత అందరూ కూర్చొని చికెన్‌తో పాటు మద్యం సేవించారు. అయితే.. విద్యార్థులు అంతటితో ఆగలేదు. మద్యం తాగుతున్నప్పుడు ఫొటోలు తీసుకున్నారు. ఆ తర్వాత తమ ఘనతను ప్రపంచం మొత్తం చూడాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ ఫొటోలు కాస్తా.. వైరల్ కావటంతో అధికారుల దృష్టికి వెళ్లింది. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ భాగ్యమతి.. హాస్టల్లోని విద్యార్థులను విచారించారు. తల్లిదండ్రుల ముందే.. పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
"హాస్టల్లో విద్యార్థులు మద్యం సేవించారన్న విషయం తెలియగానే.. పిల్లలను విచారించాను. పదో తరగతి విద్యార్థులు, కింది తరగతి విద్యార్థులు వీడ్కోలు పార్టీ చేసుకున్నట్టు తెలిపారు. అందుకోసం వార్డెన్‌తో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నారు. వంటమనిషి విజయతోనే చికెన్ వండించుకున్నారు. హాస్టల్ వార్డెన్ బయటికి వెళ్లిపోయాక.. బయటి మిత్రులతో బీరు బాటిళ్లు తెప్పించుకుని సేవించినట్టు విద్యార్థులు తెలిపారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లే వసతి గృహంలో విద్యార్థులు మద్యం సేవించారు. నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్‌పై చర్యలు తీసుకుంటాం." - భాగ్యమతి, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్
ఇదీ చూడండి: Students makes sanitation works: పారిశుద్ధ్య కార్మికులుగా.. పాఠశాల విద్యార్థులు