Supreme Court Rejected Sajjala Bhargav Reddy Petition: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఇంఛార్జి సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసులు కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. విజ్ఞప్తులు ఏవైనా హైకోర్టు ముందు చెప్పుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సూచించింది.
సజ్జల భార్గవరెడ్డి తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని చెప్పారు. చట్టాలు ఎప్పటివన్నది ముఖ్యం కాదని మహిళలపై అసభ్య పోస్టులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా నివేదించారు. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు విచ్చలవిడిగా అసభ్య పోస్టులు పెట్టడంలో కీలక సూత్రధారి భార్గవరెడ్డి అని గుర్తుచేశారు. ఈ కేసుల దర్యాప్తునకు భార్గవరెడ్డి సహకరించడం లేదని అన్నారు.
చాలా విషయాలను సుప్రీంకోర్టు ముందు గోప్యంగా ఉంచారని లూథ్రా వివరించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం దుర్భాషలాడే వాళ్లెవరైనా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదన్న సుప్రీంకోర్టు హైకోర్టును ఆశ్రయించేందుకు భార్గవరెడ్డికి 2 వారాల సమయమిచ్చింది. అప్పటివరకు అరెస్టు నుంచి రక్షణ ఉంటుందన్న సుప్రీంకోర్టు ఆ తర్వాత ఇరుపక్షాల వాదనలు విని నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ హైకోర్టుకు ఉంటుందని తేల్చిచెప్పింది.
రాంగోపాల్‌వర్మకు టెన్షన్ రిలీఫ్ - తొందరపాటు చర్యలు వద్దన్న హైకోర్టు
"ఎందుకింత ఆలస్యం?" - జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం