Family Members Carried Pregnant on Doli in Anakapalli District : అనకాపల్లి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు డోలీమోత కష్టాలు తీరలేదు. రాష్ట్రంలో అభివద్ధి కార్యక్రమాలు ఎన్నో పట్టాలెక్కుతున్నప్పటికీ ఆదివాసీ తండాలకు రహదారి సదుపాయాలు నేటికీ పూర్తిస్థాయిలో సమకూరలేదు. చినుకు రాలితే మట్టి రోడ్డు బురదమయం, జోరు వాన కొడితే ఇంటి నుంచి బయటకెళ్లలేని పరిస్థితులు. ఏళ్ల తరబడి డోలీ సాయంతో చికిత్సకోసం పరుగులు తీయాల్సిన పరిస్థితులు. పురిటి నొప్పి అయినా గుండెపోటైనా, పాముకాటైనా మరేదైనా వారికి డోలీమోతే దిక్కు. ఇప్పటికైనా మా కష్టాన్ని చూసి రోడ్లు వేయించాలని గిరిపుత్రులు వేడుకుంటున్నారు.
సోమవారం ఉదయం పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గిరిజన గర్భిణీని ఆసుపత్రికి తరలించేందుకు గిరిపుత్రుల పడిన కష్టం వర్ణనాతీతం. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ శివారు బోడిగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో స్థానికులంతా కలిసి ఆ గర్భిణిని డోలీలో మోసుకొని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏరులో నుంచే గర్భిణిని ఆస్పత్రికి మోసుకెళ్లారు. రహదారి సౌకర్యం లేక రోజూ కష్టాలు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న రహదారి పనులు పూర్తి చేసి కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాలు జారిందో అంతే సంగతి - ప్రమాదకరంగా అయిదు కిలోమీటర్లు డోలి మోత
'దారిలో ఏరు ఉద్ధృతంగా ప్రవహించడంతో మేము ఎన్నో కష్టాలను ఎదర్కోవలసి వస్తుంది. గ్రామంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లైతే వారిని తడవకుండా డోలీలో పైకి ఎత్తి శారదా నదిని దాటించాల్సి వస్తుంది. అక్కడి నుంచి దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వారిని చేరవేస్తాం. రహదారి లేక నిత్యం కష్టాలు పడుతున్నాం. కొన్ని నెలలుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలి, వంతెన నిర్మించాలి.' -గ్రామస్థులు