bandi sanjay reacts to amit shah chappal controversy: అమిత్ షా తనకు గురువు, తండ్రి లాంటి వారని... అలాంటి వ్యక్తికి చెప్పులు తీసి ఇస్తే తప్పేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా... జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో పర్యటించారు. మిదిగొండ బస నుంచి చాగల్, స్టేషన్ ఘనపూర్, శివునిపల్లి, పంనూర్ వరకు 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మునుగోడులో పొరపాటున తెరాస గెలిస్తే వ్యవసాయ మోటార్లకు కేసీఆర్ మీటర్లు పెట్టడం ఖాయమన్నారు. భాజపా మీటర్లు పెడుతున్నారంటూ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. అమిత్ షా చెప్పులు పట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచారంటూ... వచ్చిన విమర్శలను సంజయ్ తిప్పికొట్టారు.
అసలేం జరిగిందంటే.. కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటనకు ముందు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అమిత్ షా బయటకు వస్తుండగా ఆయన వెంటే ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. షా కంటే ముందు వెళ్లి ఆయన చెప్పులు తీసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై తెరాస సోషల్ మీడియా ఇంఛార్జ్ గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా..? అంటూ పోస్టు చేయగా.. ఇతర శ్రేణులు ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా దీన్ని రీట్వీట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సైతం స్పందించారు. బండి సంజయ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ ఆయన వీడియో విడుదల చేశారు.
"దిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను(బండి సంజయ్‌ని ఉద్దేశిస్తూ), దిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుణ్ని(కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ)- తెలంగాణ రాష్ట్రం గమనిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉంది" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పులు మోసి.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలకు బానిసత్వాన్ని పరిచయం చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణ సమాజాన్ని అమిత్ షా కించపరిచారని ఆరోపించారు. మునుగోడు ఆత్మగౌరవంగా చెబుతున్న భాజపా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ, అమిత్ షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టిందన్నారు.
ఇవీ చదవండి: