kandula ramesh అమరావతిని నాశనం చేసేందుకు వైకాపా చేయని ప్రయత్నం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక అడ్డుపుల్లలు, ఆరోపణలు, కోర్టు కేసులతో అమరావతిని అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలమైన వైకాపా... అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేసిందని సీనియర్ పాత్రికేయుడు, రచయిత కందుల రమేష్ రచించిన ‘అమరావతి: వివాదాలు- వాస్తవాలు’ పుస్తకంలో పేర్కొన్నారు. అమరావతిపై అడుగడుగునా అక్కసు వెళ్లగక్కుతూ, అవాస్తవాలు ప్రచారం చేస్తూ, అనేక వివాదాలు సృష్టించిన వైకాపా.. ప్రభుత్వంలోకి వచ్చినా అదే ధోరణి కొనసాగించిందని, అమరావతి ముంపు ప్రాంతమని, నిర్మాణాలకు పనికిరాదని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని... లేనిపోని వివాదాలు సృష్టించిందని, కోర్టులు మొట్టికాయలు వేసినా వైకాపా నాయకుల ధోరణి మారలేదని ఆయన పేర్కొన్నారు. రమేష్ రాసిన పుస్తకం గురువారం విడుదలవుతోంది. అమరావతి పరిణామ క్రమాన్ని దగ్గర్నుంచి పరిశీలించిన ఆయన.. అమరావతిపై ముసురుకున్న వివాదాలేంటి, వాటికి కారకులెవరు, వాటిలో వాస్తవమెంత, వైకాపా పాత్రేంటి? స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తల ముసుగులో ఆ వివాదాలకు మద్దతిచ్చినవారెవరు? చివరకు వారెలా భంగపడ్డారన్న విషయాల్ని కూలంకషంగా, సాధికారికంగా చర్చించారు. రమేష్ తన పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని ముఖ్యమైన వివాదాలు, అవి ఎలా నిర్హేతుకమో వివరించిన విధానం ఇలా ఉంది.
వివాదం: శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు విరుద్ధంగా రాజధాని ప్రాంతం ఎంపిక
వాస్తవం: శివరామకృష్ణన్ కమిటీ తయారుచేసిన సూటబులిటీ ఇండెక్స్ ప్రకారం మిగతా ప్రాంతాల కంటే విజయవాడ-గుంటూరు ప్రాంతమే అనువైనది. ఒక అస్పష్ట, అర్థరహిత నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ, చివరకు రాజధాని ఎక్కడ ఉండాలన్నది అంతిమంగా రాష్ట్రప్రభుత్వ నిర్ణయమేనని చెప్పింది. కమిటీ సిఫారసులు సలహాపూర్వకమే గానీ, ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సినవి కావని శివరామకృష్ణనే చెప్పారు. కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని ఎంపికచేసిందనే ఆరోపణను ఎన్జీటీ తిరస్కరించింది. రాజధాని ప్రాంతం ఎంపిక పూర్తిగా రాష్ట్రప్రభుత్వ అధికారమని స్పష్టంచేసింది.
వివాదం: రైతుల్ని బెదిరించి, బలవంతంగా భూములు లాక్కున్నారు
వాస్తవం: 29వేల మందికిపైగా రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. ప్రభుత్వాన్ని నమ్మి, ఇంతమంది రైతులు భూములు ఇవ్వడాన్ని పరిశీలకులు అబ్బురంగా పరిగణించారు. స్వామినాథన్ అయ్యర్ వంటి ఆర్థికవేత్తలు ప్రశంసించారు. ప్రపంచబ్యాంకు వంటి ఆర్థికసంస్థలు కూడా అమరావతి నమూనాను ఆసక్తిగా అధ్యయనం చేశాయి. అమరావతిలో భూసమీకరణ రైతులకు నష్టదాయకమని, బలవంతంగా ప్రభుత్వం భూములు లాక్కుందన్న ఆరోపణలను ఎన్జీటీ కూడా కొట్టేసింది.
వివాదం: అమరావతి నిర్మాణంతో పర్యావరణానికి తీవ్ర విఘాతం
వాస్తవం: అప్పటి ప్రభుత్వం నిబంధనలన్నీ పాటిస్తూ అమరావతి నిర్మాణం చేపట్టినా... పర్యావరణం పేరుతో దెబ్బకొట్టేందుకు చివరివరకూ ప్రయత్నాలు జరిగాయి. వ్యవస్థల్ని, కోర్టుల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది. అమరావతికి ప్రభుత్వం లక్ష ఎకరాలు సేకరించనుందని, భూసమీకరణ పేరుతో రైతుల భూముల్ని లాక్కుంటున్నారని, వేలమంది రైతులు భూసమీకరణను వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం వారిని బెదరగొడుతోందని, ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో భూసేకరణకు బదులు, ప్రభుత్వం భూసమీకరణ పద్ధతి చేపట్టిందని, దళిత రైతులకు, ఇతర రైతులకు మధ్య వివక్ష చూపిస్తున్నారని, లక్షల కోట్ల ప్రజాధనం ఈ ప్రాజెక్టులో కుమ్మరిస్తున్నారన్న ఆరోపణలతో శ్రీమన్నారాయణ అనే వ్యక్తి 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్జీటీకి వెళ్లకుండా ఇక్కడెందుకు పిటిషన్ వేశారని కోర్టు ప్రశ్నించడంతో ఆయన ఎన్జీటీకి వెళ్లారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, ప్రస్తుతం జనసేనలో ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ అమరావతికి వ్యతిరేకంగా అనుబంధ పిటిషన్లు వేశారు. వాటిని తోసిపుచ్చుతూ 2016 సెప్టెంబరులో ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
వివాదం:భూకంపాల జోన్‌లో ఉంది కాబట్టి ప్రమాదం
వాస్తవం: అమరావతి జోన్-3లో ఉంది కాబట్టి భూకంప ప్రమాదం తక్కువని, అత్యాధునిక భవన నిర్మాణ టెక్నాలజీలు వినియోగిస్తే భూకంప ప్రమాదం కనిష్ఠంగా ఉంటుందన్న ప్రభుత్వవాదనతో ఎన్జీటీ ఏకీభవించింది. అమరావతి ప్రాంతంలో 2021 ఫిబ్రవరి 27న భూకంపం సంభవించినట్టు సాక్షిలో ప్రముఖంగా వార్త వచ్చింది. ఆ రోజున భూకంపం వచ్చినట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించలేదు.
వివాదం: రాజధాని నిర్మాణంతో చిత్తడినేలలు దెబ్బతిని, పర్యావరణానికి నష్టం
వాస్తవం: రాజధానిలో చెరువులు, కుంటల వంటి జలవనరులు 616 ఎకరాల్లో ఉంటే, మరో 1,215 ఎకరాల్లో వాటిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొండవీటివాగు, పాలవాగుల్ని విస్తరించడం వల్ల కొత్తగా ప్రతిపాదించిన అయిదు కాలువల నిర్మాణం వల్ల మరో 1,410 ఎకరాల్లో గ్రీన్ బఫర్‌జోన్ ఏర్పడుతుంది.
వివాదం: తుపానుల ముప్పు ఎక్కువ
వాస్తవం: సముద్రతీరం నుంచి అమరావతి 60-80 కి.మీ.ల దూరంలో ఉన్నందున అక్కడ తుపాను తాకిడి ఉండే అవకాశం లేదన్న ప్రభుత్వ వాదనతో ఎన్జీటీ ఏకీభవించింది.
వివాదం: సారవంతమైన భూముల్లో నిర్మాణాలు చేపడితే దేశ ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతుంది
వాస్తవం: రాష్ట్రం మొత్తంలో సాగుచేస్తున్న భూమిలో రాజధాని ప్రాంత సాగుభూమి 0.027% మాత్రమే. రాష్ట్రంలో సాగవుతున్న వరిలో... రాజధానిలో సాగవుతున్న వరి విస్తీర్ణం 0.077% మాత్రమే. దీన్నిబట్టి అమరావతిలో రాజధాని నిర్మాణం వల్ల దేశ ఆహారభధ్రతకు ముప్పన్న వాదన తప్పని ఎన్జీటీ పేర్కొంది.
వివాదం: అమరావతి నిర్మాణానికి కేంద్ర పర్యావరణ సంస్థ అనుమతి తీసుకోలేదు
వాస్తవం: రాజధాని నిర్మాణానికి ఇచ్చిన పర్యావరణ అనుమతుల మీద అనేక రకాల వివాదాలు రేపడానికి ప్రయత్నాలు జరిగాయి. మొదట జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాన్ని కోర్టు అడ్మిట్ చేసుకోలేదు. తర్వాత పి.శ్రీమన్నారాయణ, ఈఏఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ ఎన్జీటీలో పిటిషన్లు వేశారు. 2015 నుంచి 2019 వరకు ఎన్జీటీలో, తర్వాత సుప్రీంకోర్టులో కేసులు కొనసాగాయి. వారి వాదన ఎక్కడా నిలబడలేదు. పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ 2006లో దేశవ్యాప్తంగా ప్రాజెక్టులను ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వ అనుమతి అవసరం కాగా, బీ కేటగిరీ ప్రాజెక్టులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ ముందస్తు అనుమతి చాలు. అమరావతి నిర్మాణం బీ కేటగిరీలోకి వస్తుంది. రాష్ట్ర పర్యావరణ సంస్థ అనుమతిని ప్రభుత్వం తీసుకుంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన పర్యావరణ ప్రభావ మదింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పూర్తిచేసిందని ఎన్జీటీ పేర్కొంది.
వివాదం: అమరావతి ప్రాంతం కాలుష్య కాసారం
వాస్తవం: అమరావతి ప్రాజెక్టు ప్రాంతం కాలుష్య కాసారమని ఆరోపిస్తూ నేషనల్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ స్టేటస్ అండ్ ట్రెండ్స్-2012 నివేదికను పిటిషనర్లు చూపారు. నిజానికి దానిలో అమరావతి ప్రాంత ప్రస్తావన లేదు. విజయవాడ బెంజిసర్కిల్ ప్రస్తావన ఉంది. ప్రతిపాదిత రాజధాని కృష్ణానదికి ఆవల ఉంది. అక్కడ కాలుష్యభయాలకు హేతువు లేదని ఎన్జీటీ స్పష్టంచేసింది.
వివాదం: గత ప్రభుత్వం అమరావతి పనుల్లో విపరీతమైన జాప్యం చేసింది
వాస్తవం: ఆ జాప్యానికి ప్రధాన కారణం ప్రాజెక్టును అడుగడుగునా అడ్డుకున్న సైంధవులే. ఎన్జీటీలో రెండేళ్లు, సుప్రీంకోర్టులో ఏడాదిపాటు కేసులు నడవడంతో పనులు వేగంగా చేపట్టేందుకు వీల్లేకపోయింది.
వివాదం: అమరావతి భవన నిర్మాణాలకు పనికిరాదు... ఎక్కువ ఖర్చుపెట్టాలి
వాస్తవం: సాధారణ ప్రాంతాల్లో నిర్మాణాలకు రూ.లక్ష ఖర్చయితే అమరావతిలో రూ.2లక్షలు ఖర్చుపెట్టాలని అప్పటి పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దానికి శాస్త్రీయ ఆధారం లేదు. ఎల్‌అండ్‌టీ సంస్థ అమరావతిలో తలపెట్టిన 40 అంతస్తుల భవనాలకు పునాది లోతు 10.9 మీటర్లు చాలని ఐఐటీ మద్రాసు నివేదిక ఇచ్చింది. సచివాలయం టవర్లకు తీసిన పునాదుల్లో పది మీటర్లలోనే రాతిపొర తగిలింది.
వివాదం: అమరావతి ముంపు ప్రాంతమని మద్రాసు ఐఐటీ నివేదిక ఇచ్చినట్టు ప్రచారం
వాస్తవం: అమరావతి ముంపు ప్రాంతమనే వాదనను ఎన్జీటీ తోసిపుచ్చినా... సాక్షి సహా కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారు. 2021 జనవరిలో ఐఐటీ మద్రాసు అధ్యయనం ప్రకారం అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని ప్రచురించారు. తాము అలాంటి నివేదిక ఇవ్వలేదని ఐఐటీ మద్రాసులో డీన్ డాక్టర్ రవీంద్రగెట్టు, చైర్ ప్రొఫెసర్ వి.ఎస్.రాజు స్పష్టంచేశారు.
వివాదం: అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్
వాస్తవం: అమరావతి భూకుంభకోణం అంటూ సొంత మీడియాతో పాటు అనుకూల, జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన వైకాపా ప్రభుత్వం ఒక్కరిమీదా ఆరోపణలు రుజువు చేయలేకపోయింది. అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయంటూ 2020 సెప్టెంబరు 7న రాష్ట్రప్రభుత్వం పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసింది. 2014 జూన్ 9న ప్రమాణస్వీకారం రోజునే నాటి సీఎం చంద్రబాబు కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య కృష్ణానదీ తీరం మీద కొత్త రాజధాని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. దానిలో రహస్యమేమీ లేదు.
వివాదం: అంతా గ్రాఫిక్స్ మాయాజాలం
వాస్తవం: వైకాపా అధికారంలోకి వచ్చేనాటికే అమరావతిలో 2.1 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా, అందులో 40 లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని మూడేళ్లలో అప్పటి ప్రభుత్వం పూర్తిచేయగలిగింది. అడ్డంకులు, ఆర్థిక పరిమితులు, పర్యావరణ నిబంధనలకు లోబడి ఇంత తక్కువ కాలంలో ఇన్ని భారీ నిర్మాణాలు చేపట్టడం ఇటీవలి కాలంలో లేదు. భూసమీకరణ, వేలాది ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, అమరావతి మాస్టర్‌ప్లాన్ రూపకల్పన, వివిధ ఆర్థికసంస్థలతో రుణ ఒప్పందాలు, ఐకానిక్ భవనాల డిజైన్లకు తుది మెరుగులు, వందకుపైగా ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్ని అమరావతికి రప్పించడానికి ఒప్పందాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసుల అధికారుల నివాస భవనాల నిర్మాణాల వంటి పనులెన్నో జరిగాయి.
వివాదం: అమరావతి నిర్మాణానికి రూ.లక్షల కోట్లు కావాలి. అంత ఖర్చుచేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితేంటి?
వాస్తవం: అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. అప్పటి ప్రభుత్వ అంచనా ప్రకారం అమరావతి నిర్మాణానికయ్యే ఖర్చు రూ.55,343 కోట్లు. దానిలో ప్రభుత్వం నేరుగా తన వనరుల నుంచి పెట్టేది రూ.12,600 కోట్లే. దానిలో రూ.5,971 కోట్లు ప్రభుత్వ గ్రాంటుగా, రూ.6,629 కోట్లు ప్రభుత్వవాటాగా పెట్టాలని నిర్ణయించారు. 2026 వరకూ రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం ఏటా గరిష్ఠంగా ఇచ్చేది రూ.1,800 కోట్లే. అమరావతి నిర్మాణానికి అవసరమైన మిగతా రూ.37,112 కోట్లూ ప్రపంచబ్యాంకు, హడ్కో వంటి ఆర్థికసంస్థల ద్వారా, బ్యాంకుల ద్వారా, బాండ్ల అమ్మకం ద్వారా సేకరించాలని నిర్ణయించారు.
వివాదం: అమరావతిలో అవినీతి జరగడం వల్లే ప్రపంచబ్యాంకు వైదొలగింది
వాస్తవం: ప్రపంచబ్యాంకు రూ.4,923 కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధమైన దశలో అమరావతిపై అక్కసుతో వైకాపా ప్రభుత్వమే వెళ్లగొట్టింది. అమరావతికి ఆర్థికసాయం అందకుండా ఆ ప్రాంతంలోని ఒకరిద్దరు భూకామందులతో పాటు, వైకాపా మద్దతుదారులు ప్రయత్నించారు. స్వచ్ఛందసంస్థలు, పర్యావరణ పరిరక్షకుల పేరుతో, పేదలకు జీవించే హక్కు పేరుతో ప్రపంచబ్యాంకుకు ఊపిరాడకుండా చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో... ప్రపంచబ్యాంకు ఆర్థికసాయంపై మీ వైఖరేంటో చెప్పాలని కేంద్రం లేఖ రాసింది. రాష్ట్రం నుంచి స్పందన లేకపోవడంతో ప్రపంచబ్యాంకు ఆ ప్రాజెక్టు నుంచి వైదొలగింది.
వివాదం: చంద్రబాబు కులానికి చెందిన భూస్వాములు, పొలాలను కౌలుకిచ్చి నగరాల్లో ఉండే ఆసాములే భూసమీకరణతో లబ్ధి పొందారు
వాస్తవం: అమరావతిలో భూసమీకరణను వ్యతిరేకించిన భూస్వాములు, ధనిక రైతుల్ని పేదవారని.. ఎకరం రెండెకరాల రైతుల్ని భూస్వాములు, అగ్రకులాల వారని విమర్శకులు వ్యాఖ్యానాలు చేశారు. భూసమీకరణను వ్యతిరేకించిన 10% రైతుల్లో అత్యధికులు పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లోని రైతులే. వారిలో ఎక్కువమంది రెడ్డి వర్గీయులే. వారు భూములివ్వడానికి నిరాకరించడానికి కుల రాజకీయాలు కారణం కాదు. తమ పొలాలు విజయవాడకు సమీపంలో ఉండటంతో రాజధాని ప్రకటనకు ముందే ఎక్కువ ధర లభిస్తోందని, తమకు తుళ్లూరు ప్రాంతంలో తక్కువ రేట్లు ఉండే పొలాలతో సమానంగా పరిహారం ప్రకటించడం సమంజసం కాదని వారు వాదిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితోపాటు పలు సంఘాల అండదండలతో వారు అమరావతి వ్యతిరేక ప్రచారాన్ని ఉద్ధృతంగా చేయగలిగారు.
వారికి ఉన్నత పదవులు
అమరావతికి వ్యతిరేకంగా ప్రచారం చేసి, కేసులు వేసినవారిలో కొందరు వైకాపా అధికారంలోకి వచ్చాక ఉన్నత పదవులు పొందారని రచయిత పేర్కొన్నారు. జస్టిస్ పి.లక్ష్మణరెడ్డిని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమించడాన్ని, ఏబీకే ప్రసాద్‌కి 2021లో వైఎస్సార్ జీవితసాఫల్య పురస్కారం ఇవ్వడాన్ని, మద్యపాన నిషేధ కమిటీ ఛైర్మన్‌గా వి.లక్ష్మణరెడ్డిని నియమించడాన్ని, క్యాబినెట్ ర్యాంకు కలిగిన ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు పదవి అజేయకల్లంకి దక్కడాన్ని ఆయన గుర్తుచేశారు.
వివాదం: అమరావతికి భూములిచ్చినవారిలో ఎక్కువమంది ఒకే సామాజికవర్గం వారు. వారి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది
వాస్తవం: రాజధానికి భూములిచ్చిన వారిలో అధికశాతం ఎస్సీ, ఎస్టీలే. రెడ్లు, కమ్మలు, బీసీలు, కాపులు, మైనారిటీలు తర్వాతి వరసలో ఉన్నారు. భూసమీకరణలో పాల్గొన్నవారిలో 7వేల మంది ఎస్సీలే. అమరావతి కమ్మవారిదే అనే ప్రచారాన్ని ఉద్ధృతంగా చేసిన వైకాపా ప్రభుత్వమూ ఈ లెక్కలను తిరస్కరించలేదు. రాజధానికి భూములిచ్చిన వారిలో మూడోవంతు కూడా కమ్మవారు లేరు. 34వేల ఎకరాలను భూసమీకరణలో ఇవ్వడానికి రైతులు ఒప్పుకొంటే.. అందులో 8-9వేల ఎకరాలు కమ్మ రైతులకు చెందినవని అంచనా. వీరంతా తమ ఆర్థిక ప్రయోజనాల కంటే కులాన్నే పరిగణనలోకి తీసుకుని భూములిస్తే.. మిగిలిన 25వేల ఎకరాల భూముల్ని మిగతావారు ఎందుకిచ్చినట్లు?
ఇవీ చదవండి: