August wages in RTC are as per PRC ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ)లో గత రెండున్నరేళ్లలో పదోన్నతులు పొందిన వారు మినహా, మిగిలిన ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సాధారణంగా ఆర్టీసీలో జీతాల బిల్లులు ప్రతినెలా 20-25 తేదీల మధ్య సిద్ధం చేస్తుంటారు. ఇప్పటికే పాత జీతాల మేరకు బిల్లులు సిద్ధం చేయాలని ఆదేశించగా, తాజాగా పీఆర్సీ ప్రకారం ఇవ్వాలని నిర్ణయించారు. మంగళవారం అన్ని జిల్లాల ప్రజా రవాణాశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులకు జూన్ నుంచి పీఆర్సీ అమలుచేస్తూ అదే నెల 3న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆర్థికశాఖ కొర్రీల కారణంగా పాత జీతాలే చెల్లించారు.
ఆగస్టు నెలకయినా కొత్త పీఆర్సీతో జీతం వస్తుందని ఉద్యోగులు ఆశించినప్పటికీ.. పదోన్నతులపై ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పింది. గత రెండున్నరేళ్లలో ఆర్టీసీలో దాదాపు 1,500-2,000 మందికి పదోన్నతులు కల్పించగా, వీటికి ప్రభుత్వ అనుమతి లేనందున పీఆర్సీ వర్తింపజేయలేమని పేర్కొంది. ఇంతలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో సీఎంకు వినతులు పంపించేందుకు అన్ని జిల్లాల సిబ్బంది నుంచి సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వడానికి కసరత్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి: