Attack on Marredpally SI : హైదరాబాద్‌లో విధుల్లో ఉన్న పోలీసులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇటీవల సంగారెడ్డిలో పోలీసులపై జరిగిన దాడి మరవకముందే.. మరో ఘటన చోటుచేసుకుంది. మారేడ్‌పల్లిలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై వినయ్‌కుమార్‌పై.. రాత్రి 2 గంటల సమయంలో దుండగులు కత్తితో దాడిచేశారు. పెట్రోలింగ్ చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరిని ఎస్సై ప్రశ్నించారు. ఇద్దరిని ప్రశ్నిస్తుండగానే.. చిన్న కత్తితో ఎస్సై కడుపులో పొడిచి వ్యక్తి పరారయ్యాడు.
గాయాలైన ఎస్సై వినయ్‌కుమార్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వినయ్ కుమార్ చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. దాడి జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఉందా లేదోనని ఆరా తీస్తున్నారు.
వారం క్రితం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, రవిలు దొంగల పట్టివేతకు మఫ్టీలో మాటువేశారు. ఓ ద్విచక్రవాహనం ఆపి తనిఖీ చేస్తుండగా యాదయ్యపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఆయన ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.