పాలకవర్గం సమావేశం ఏర్పాటు నిమిత్తం మాన్సాస్ ట్రస్ట్ కార్యనిర్వహణాధికారి ( ఈవో ) ఈ ఏడాది జూన్ 9 న జారీచేసిన ప్రొసీడింగ్స్ ను సవాలు చేస్తూ మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పి.అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు . పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చి 3 న జారీచేసిన జీవో 75 అమలును నిలుపుదల చేయాలని కోరారు . తమ ఆదేశాలను అనుసరించేలా ఈవోను ఆదేశించాలని అభ్యర్థించారు . దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి , కమిషనర్ , మాన్సాస్ ట్రస్ట్ ఈవో డి.వెంకటేశ్వరరావును వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు . హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్ రావు వద్దకు శనివారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది . ఆ వ్యాజ్యంపై విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు న్యాయమూర్తి తెలిపారు . ఈ వ్యాజ్యం ఏ బెంచ్ వద్దకు విచారణకు వెళ్లాలో నిర్ణయం తీసుకునే నిమిత్తం కేసు ఫైలును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి ముందు ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు .
ఉద్యోగుల ఆందోళన.. ఏం జరిగిందంటే
కొద్దిరోజుల కిందట విజయనగరంలోని మాన్సాస్ కార్యాలయాన్ని ట్రస్టు కళాశాలల ఉద్యోగులు ముట్టడించారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని ఆందోళనకు దిగారు. జీతాలు నిలిపివేయాలని ఈవో వెంకటేశ్వరరావు బ్యాంకుకు లేఖ రాయడంతోనే వేతనాలు నిలిచిపోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలుగా అరకొర జీతాలతోనే పనిచేస్తున్నా..ఈనెల పూర్తిగా నిలిపివేశారని మండిపడ్డారు. అడిగితే నాకేం తెలియదని ఈవో చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల సమస్యలను ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు దృష్టికి ఉద్యోగులు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఈవో తీరుపై గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.
ఇదీ చదవండి