ArunSagar Awards 2022: సాహితీ, పాత్రికేయ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే అరుణ్‌సాగర్ విశిష్ట పురస్కారాల వేడుక తెలంగాణలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా జరిగింది. మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు హాజరయ్యారు.
అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవి ప్రసాదమూర్తికి, విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు ఎం.నాగేశ్వరరావుకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు ప్రసాదమూర్తి, నాగేశ్వరరావు.. అరుణ్సాగర్తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ట్రస్ట్ ప్రదానం చేసిన పురస్కార నగదును.. అరుణ్‌సాగర్ కుమార్తె శ్రిత విద్యాభ్యాసం కోసం ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు నాగేశ్వరరావు అందజేశారు. వర్ధమాన పాత్రికేయులకు అరుణ్‌సాగర్ ఒక స్ఫూర్తి అని ఆయన కొనియాడారు.
అరుణ్‌సాగర్ ఒక మెరుపు..
"అరుణ్ సాగర్ నాకు మంచి మిత్రుడు. లాంగ్ జర్నీ ఇష్టపడే ఆయన లైఫ్ షార్ట్ అవటం దురదృష్టకరం. అరుణ్‌సాగర్ ఒక మెరుపు. నికార్సయిన ఆయన వ్యక్తిత్వం.. తన రచనల్లో కనిపించేది. అరుణ్‌సాగర్ స్నేహశీలి, వర్ధమాన పాత్రికేయులకు ఆయనో స్ఫూర్తి. ఆయన పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసిన స్నేహితులకు అభినందనలు. సమాజానికి మంచి పాత్రికేయులను అందించేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నా. అరుణ్ సాగర్ పురస్కార నగదును ఆయన కుమార్తె చదువుకు ఇస్తున్నా" - ఎం. నాగేశ్వరరావు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు
అతడే అవార్డుగా మారాడు..
"నా కుటుంబంతో గడిపిన సమయం కంటే అరుణ్ సాగర్‌తోనే ఎక్కువగా ఉండేవాడిని. మనకెప్పుడు అవార్డులు వస్తాయని అరుణ్ నాతో అనేవాడు. అతడే అవార్డుగా మారతాడని ఎప్పుడూ అనుకోలేదు. ఆ తమ్ముడి పేరుతో అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది" - ప్రసాదమూర్తి, ప్రముఖ కవి, విమర్శకులు
ఇదీ చూడండి: