ఆరోగ్యశ్రీ ద్వారా ముఖ్యంగా 5 జిల్లాల ప్రజలే ఎక్కువగా లబ్ది పొందుతున్నారని వైద్యరంగ సంస్కరణల కమిటీ తన నివేదిక ద్వారా తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అందుతున్న క్లైయిమ్‌లలో దాదాపు సగం కృష్ణా, విశాఖ, నెల్లూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల నుంచే వస్తున్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలు సేవల పట్ల అవగాహన లేక వెనుకబడిపోతున్నారని.... అనంతపురం జిల్లా వాసులు వైద్యం కోసం గుంటూరు, విజయవాడ వస్తున్నారని పేర్కొంది.
సకాలంలో వైద్యం పొందని లబ్ధిదారులు...
శ్రీకాకుళం, అనంతపురం, విజయనగరం, కడప జిల్లాలో జీవనశైలి వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉన్నా సకాలంలో వైద్య సేవలు పొందడం లేదని కమిటీ తెలిపింది. 2014-18 మధ్యకాలంలో ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిపొందిన వారి సంఖ్య లక్షా 95 వేల నుంచి 3 లక్షల 44 వేలకు చేరింది. 200 రోగాలకు సంబంధించి 90 శాతం చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ ఏడాది నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాలకూ ఆరోగ్యశ్రీ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. వీటికి 24 కోట్ల 50 లక్షల రూపాయల క్లైయిమ్స్ అందాయి. 130 ఆసుపత్రుల్లో 56 వేల 103 మంది డయాలసిస్ చేయించుకోగా 311 కోట్ల 71 లక్షల రూపాయల చెల్లింపులు జరుగుతున్నాయి.