Mortgage to Vijayawada Berm Park: భవనాలు, స్థలాలు అయిపోయాయి.. ఇప్పుడు పార్కుల వంతు వచ్చింది. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే అత్యంత విలువైన బెర్మ్ పార్కును ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) తనఖా పెట్టింది. వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.143 కోట్ల రుణం తీసుకుంటోంది. తనఖా ప్రక్రియ పూర్తి కావడంతో తొలి విడతగా నాలుగైదు రోజుల్లో రూ.35 కోట్ల మొత్తాన్ని బ్యాంకు విడుదల చేయనుంది. తొలుత ఏపీటీడీసీకి విజయవాడలో ఉన్న పలు ఆస్తులను పరిశీలించినా చివరకు వ్యాపారం బాగా నడుస్తున్న, ఆస్తుల పరంగా ఎంతో విలువైన బెర్మ్ పార్కువైపే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ రుణంతో పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడంతో పాటు హోటళ్లు, రిసార్టులను ఆధునికీకరిస్తామని బ్యాంకుకు ఏపీటీడీసీ తెలిపింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2015-16లో ప్రారంభించిన వివిధ ప్రాజెక్టుల పనులు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. చేసిన పనులకే దాదాపు రూ.10 కోట్లకుపైగా పెండింగ్ బిల్లులు చెల్లించాలి. దీంతో మిగిలిన పనులకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. అసంపూర్తిగా పనులు నిలిచిపోయిన వాటిలో ఇడుపులపాయలో రాజీవ్ నాలెడ్జి వ్యాలీ, లంబసింగి, బొర్రా గుహలు, అహోబిలంలో పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పన, గండికోట, కోటప్పకొండ వద్ద తీగ మార్గం (రోప్‌వే) వంటివి ఉన్నాయి. ఏపీటీడీసీకి చెందిన హోటళ్లు, రెస్టారెంట్ల ఆధునికీకరణ ప్రతిపాదనలూ నిధుల కొరతతో చాలాకాలంగా కార్యరూపం దాల్చడం లేదు. వీటిని పూర్తి చేయడానికి బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఏపీటీడీసీ రెండు, మూడు బ్యాంకులను సంప్రదించి, చివరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు బెర్మ్ పార్కును రూ.143 కోట్ల రుణం కోసం తనఖా పెట్టింది. రుణ వడ్డీ, ఎన్ని వాయిదాల్లో తిరిగి చెల్లించాలనే విషయాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
అయిదెకరాల పార్కు.. విజయవాడలో అయిదెకరాల్లో బెర్మ్ పార్కు విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి రోజూ వందలాది మంది బోట్లలో భవానీ ద్వీపానికి వెళ్లి వస్తుంటారు. బెర్మ్ పార్కును ఆనుకొని బోటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం పార్కు ప్రాంగణంలో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో హోటల్ నిర్వహిస్తున్నారు. ఇందులో 30 వరకు గదులున్నాయి. పెద్ద సమావేశ హాలు ఉంది. సమావేశాలకు, శుభకార్యాలకు దీన్ని అద్దెకు ఇస్తుంటారు.
పనులపై ఏపీటీడీసీ చేసిన ప్రతిపాదనలివీ..
మొత్తం 9 పెండింగు ప్రాజెక్టులకు ఇప్పటివరకు రూ.8.74 కోట్ల వ్యయం కాగా, ఇంకా రూ.41.70 కోట్లు అవసరం. హోటళ్లు, రిసార్టుల ఆధునికీకరణ పనులు 17 ఉండగా వాటికి ఇప్పటివరకు రూ.3.62 కోట్ల వ్యయమైంది. మరో రూ.55.82 కోట్లు అవసరం. ఇలా మొత్తం రూ.97.52 కోట్ల పనులకు ప్రతిపాదించినట్లు సమాచారం.