ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఆర్టీసీ పాలక మండలి ఆమోదం తెలిపింది. ఉద్యోగులందరినీ పబ్లిక్ ట్రాన్స్పోర్టు డిపార్టుమెంట్లోకి తీసుకుని, వేతనాలు ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి పీడీపీ ద్వారా కార్మికులకు వేతనాలు చెల్లించాలని కోరింది. విజయవాడ ఆర్టీసీ భవన్లో పాలకమండలి సమావేశమైంది. ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుని, ఆదేశాలు జారీ చేసింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలోని అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు విలీన ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ కీలక నిర్ణయానికి పాలకమండలి తీర్మానం తప్పనిసరిగా కావడం వలన... పాలమండలి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో వివిధ అంశాలపై తీర్మానాలు చేసిన పాలకమండలి, పెండింగ్లో ఉన్న పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. సంస్థలో ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. పాలకమండలిలో ఈ అంశంపై చర్చించి తీర్మానం చేశారు. ఆర్టీసీలో 350 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు అనుమతిస్తూ పాలకమండలి తీర్మానించింది. వీటితో పాటు కార్మికుల సమస్యలకు సంబంధించి మరో 27 అంశాలను బోర్డు చర్చించి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి :