APSRTC employees on PRC: పీఆర్సీని వెంటనే అమలు చేయడం సహా పెండింగ్‌లో ఉన్న సమస్యలను అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వినతి పత్రాలు పంపించేందుకు ఆర్టీసీ ఉద్యోగులు నిర్ణయించారు. ఆర్టీసీ ఐకాసలో ఉన్న 14 సంఘాలు నేతలు వర్చువల్ పద్థతిలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ సహా పలు సంఘాల నేతలు సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. పీఆర్సీ అమలు చేయడం సహా ఇబ్బందులను తీర్చాలని ఆర్టీసీ ఉద్యోగుల ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు. ఈనెల 21 నుంచి 28 వరకు ఆర్టీసి ఉద్యోగులు సీఎంకు వినతి పత్రాలు పంపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉద్యోగుల సంతకాల సేకరణ అనంతరం ముఖ్యమంత్రికి వినతి పత్రాలు పంపాలని నిర్ణయించారు. సమస్యల పరిష్కారం కోసం రేపు ఆర్టీసి ఎండీకి మరోసారి వినతి పత్రం ఇవ్వాలని ఐక్యవేదిక నిర్ణయించింది. ఇప్పటికీ చాలాసార్లు ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వానికి వినతులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వంలో విలీనం వల్ల ఎన్నో ప్రయోజనాలు వస్తాయని ఆర్టీసి ఉద్యోగులు ఆశించారని.. ప్రభుత్వ ఉద్యోగులకు వస్తున్న పాత పెన్షన్, ఇతర సౌకర్యాలు, ప్రయోజనాలు, జీతభత్యాలు రావడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ లాంటి సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సౌకర్యాలు, అలవెన్సులు, ఇన్సెంటివ్ స్కీమ్స్ నిలుపుదల చేస్తున్నారని.. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగ సంఘాలతో ఎటువంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఐక్యవేదిక నేతలు ఆరోపించారు. ఆర్టీసీ యాజమాన్యం సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగులలో అసంతృప్తి పెంచుతున్నారని అభిప్రాయపడ్డారు. సీఎంకు వినతిపత్రాలు ఇచ్చిన తర్వాత రాష్ట్రస్థాయిలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించాలని నేతలు నిర్ణయించారు. అనంతరం భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఆర్టీసీ ఐక్యవేదిక కన్వీనర్లు తెలిపారు.
ఇవీ చదవండి:
- కత్తి విన్యాసాలతో గిన్నిస్ రికార్డ్, ఒకే చోట వేలాది మంది కలిసి
- టీసీ ఇవ్వలేదని కళాశాలలోనే పెట్రోల్ పోసుకొని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
- కాకినాడ గ్రామీణ మండలంలోని పరిశ్రమలో పేలుడు