APPSC: గ్రూప్-1 మినహా మిగిలిన ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్‌ను (ప్రాథమిక పరీక్ష) తొలగించాలన్న ఆలోచనను ఏపీపీఎస్సీ విరమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెవెన్యూశాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన ప్రకటనలో స్క్రీనింగ్, మెయిన్స్ ఉంటుందని ప్రకటించడంతో ఏపీపీఎస్సీ మనోగతం బయటపడింది. ఇతర ఉద్యోగాల భర్తీలో ఇదే విధానాన్ని కమిషన్ అవలంబిస్తుందా? లేదా? అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. పరీక్షల నిర్వహణలో స్థిర నిర్ణయాలు లేకుంటే నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 ముందు వరకు గ్రూప్-1 మినహా మిగిలిన ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించేవారు. అయితే మరింత సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో రెండు పరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్) విధానాన్ని అమల్లోకి తెచ్చారు.
ఈ క్రమంలో గ్రూప్ 2, 3 వంటి ఉద్యోగాల నోటిఫికేషన్లకు లక్షల్లో దరఖాస్తులు వస్తుండటంతో ఆఫ్‌లైన్‌లో ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో అర్హత సాధించిన వారిని 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు అనుమతిస్తున్నారు. ఒక నోటిఫికేషన్ వచ్చి, నియామకాలు పూర్తయ్యేందుకు కనీసం ఒకటి రెండేళ్లు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ప్రిలిమ్స్ లేకుండా కేవలం ఒకే పరీక్ష ద్వారా నియామకాలు చేపడతామని ఇటీవల ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. ప్రిలిమ్స్ నిర్వహించకుండా.. ఒకే పరీక్ష నిర్వహిస్తే ప్రతిభావంతులు నష్టపోతారని పలువురు నిరుద్యోగులు కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఒకే పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని.. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని మరికొందరు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. వీటిపై తర్జనభర్జనల అనంతరం రెవెన్యూశాఖలో 670 ఉద్యోగాలను ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా భర్తీ చేస్తామని కమిషన్ ప్రకటించింది. దీనికి డిగ్రీ అర్హత కావడంతో 4 లక్షల మంది వరకు దరఖాస్తు చేస్తారని భావిస్తున్నారు.
50 వేల దరఖాస్తుల వరకు..
రాష్ట్ర ప్రభుత్వం 2019 మార్చిలో నోటిఫికేషన్లలో పేర్కొనే ఒక్కో ఖాళీ భర్తీకి 200 దరఖాస్తులు దాటితే ప్రిలిమ్స్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు సర్వేశాఖలో 5 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు ఐదువేల వరకు దరఖాస్తులు వచ్చాయి. రెండు పరీక్షలు జరిపారు. ఇలాంటి వాటికి ఒకే పరీక్ష నిర్వహించేలా ఉత్తర్వులు సవరించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఒకేరోజు 50వేల మందికి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి..
తెలుగురాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు.. ఆ అంశాలపై చర్చించేందుకే..!