AP PCC President on Budget: అమరావతి రాజధానిపై వైసీపీ ప్రభుత్వం మరోసారి తన అక్కసును పరోక్షంగా వెళ్లగక్కిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. తొలి నుంచి వ్యతిరేకత భావాన్ని ప్రదర్శిస్తూ వస్తోన్న సీఎం జగన్ రెడ్డి కనీసం హైకోర్టు తీర్పుతో మారతారని.. అమరావతి అభివృద్ధికి కాకపోయినా న్యాయమూర్తులు చెప్పినట్లుగా రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తారని ఆశించగా వారికి నిరాశే ఎదురైందని తెలిపారు.
బడ్జెట్లో అమరావతికి చిల్లిగవ్వ నిధులు కూడా కేటాయించలేదని అన్నారు. రాజధాని అభివృద్ధికి ఏమాత్రం కేటాయింపులు జరపకపోవడం శోచనీయమని అన్నారు. అమరావతి రాజధానిని ఆరు నెలల వ్యవధిలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. నిధులు కేటాయించకపోవడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు.
మూడు నెలల్లో లేఅవుట్లు వేసి రాజధాని రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని హైకోర్టు పేర్కొన్నప్పటికీ.. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా అమరావతి పేరును ఉచ్చరించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు 25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు ఎవరి మెడలు వంచుతున్నారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: "ఇదో మాయల మరాఠీ బడ్జెట్.. ఎక్కడా రాజ్యాంగ బద్ధంగా లేదు''