Sky Cycling in Visakhapatnam : విశాఖలో పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. విశాఖ అంటే వెంటనే గుర్తుకువచ్చే కైలాసగిరి కేంద్రంగా ప్రకృతి అందాలను వినూత్నంగా తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో ‘స్కై సైక్లింగ్’ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీని కోసం కొన్నిరోజులుగా ‘సన్నద్ధ పరీక్షలు’ నిర్వహిస్తోంది. గాలిలో తేలిపోతూ విశాఖ నగర అందాలు, నీలి సాగర తీర సొబగులను తిలకించేందుకు నగరవాసులు ఉత్సాహంగా నిరీక్షిస్తున్నారు.
ఆకాశంలో తాడుపైన సైక్లింగ్ : విశాఖపట్నంలో త్వరలోనే మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి రానుంది. కైలాసగిరి కొండపై స్కైసైక్లింగ్ పేరిట అందుబాటులోకి తీసుకురానున్న పర్యాటక ఆకర్షణ కోసం ప్రస్తుతం ట్రయిల్ రన్ జరుగుతోంది. ఆకాశంలో తాడుపైన సైక్లింగ్ చేసేందుకు నిర్ణీత రుసుం చెల్లించి ఆనుభవవాన్ని పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని పర్యాటకులకు పూర్తి భరోసాతో ఈ స్కై సైక్లింగ్ ను ప్రారంభించనున్నారు. వీఎంఆర్డీఏ, టూరిజం శాఖ దీనిపై ప్రత్యేకంగా కసరత్తు చేసి కాంట్రాక్టర్ ను నిర్ణయించాయి.
మరో పర్యాటక కేంద్రం సిద్ధం : ఇప్పటికే కైలాసగిరి కొండపై ఉన్న రోప్ వే పర్యాటక ఆకర్షణగా ఉంది. ట్రయిల్ రన్ జరుగుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా ఆధునీకరణ చేయాల్సి ఉంది. ఈ స్కై సైక్లింగ్ అందుబాటులోకి వస్తే చాలా ఏళ్ల తర్వాత మరో పర్యాటక ఆకర్షణ ఇక్కడ మొదలైనట్టుగా పరిగణించవచ్చు. అంతా సజావుగా సాగితే మరి కొద్ది రోజుల్లోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
పర్యాటక రంగంలో మరో అద్భుతం - విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్
నల్లమలలో సరికొత్త జల పర్యాటకం - అబ్బురపరిచే దృశ్యాలతో మరో టూరిస్ట్ స్పాట్