Bopparaju On Employees Protest: ప్రభుత్వం దృష్టికి 71 డిమాండ్లు తీసుకెళ్లామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 13 లక్షల మంది డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యోగ సంఘ నేతలతో కలిసి కడపలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు సానుకూల స్పందన రాలేదన్నారు.
ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్న ఆయన.. 11వ పీఆర్‌సీ అమలు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఇస్తామంటూ 7 డీఏలు పెండింగ్‌లో ఉంచారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ చెప్పారని గుర్తు చేశారు.
'ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా పెండింగ్‌లో ఉంది. వైద్య ఖర్చుల రీయంబర్స్‌మెంట్ జరగడం లేదు. మా సమస్య వినే స్థితిలో ప్రభుత్వం లేదు. అందుకే రోడ్లపైకి వచ్చాం. రేపట్నుంచి ఉద్యమ కార్యాచరణ, ప్రతి ఉద్యోగీ నల్ల బ్యాడ్జీ ధరించాలి. ఈ నెల 16 న అన్ని కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాలి. ప్రభుత్వం దిగిరాకుంటే రెండోదశలో ఉద్యమం తీవ్రం. 2 ఐకాసలు ఇచ్చిన 71 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి' - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ ఛైర్మన్
గత్యంతరం లేకనే.. రోడ్డు మీదకు వచ్చాం - బండి శ్రీనివాసరావు
Bandi Srinivasa Rao On Employees Protest: రేపట్నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రారంభమవుతుందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వెల్లడించారు. విజయనగరంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వానికి మొత్తం 71 డిమాండ్లు ఇచ్చామన్నారు. 2 నెలలుగా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. తిరుపతిలో సీఎం ఇచ్చిన హామీపై తమకు సమాచారం లేదన్నారు. చాలీచాలని జీతాలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్న ఆయన.. ఉద్యోగులకు 7 డీఏల బకాయిలు ఇవ్వాలని తెలిపారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ కూడా సకాలంలో రావడం లేదని వ్యాఖ్యానించారు. గత్యంతరం లేకే రోడ్డు మీదకు వచ్చామని స్పష్టం చేశారు.
'డిమాండ్లు పరిష్కరించే వరకు పోరుబాట ఉంటుంది. పీఆర్‌సీ ప్రకటించాలనేదే మా ప్రధాన డిమాండ్. ఎస్మా ప్రయోగించినా వెనకడుగు వేయం' - ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు
ఇదీ చదవండి:
Raghurama vs YSRCP MP's : లోక్‌సభలో రఘురామ, వైకాపా ఎంపీల మాటల యుద్ధం