కరోనా వైరస్ సోకిన వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించి.. మరణాల సంఖ్య తగ్గేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వైరస్ నియంత్రణ చర్యలపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి... జిల్లా కలెక్టర్లు, జేసీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఆమె వీడియో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 60 ఏళ్లు నిండిన వారిని, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 6వ విడత ఇంటింటా సర్వే కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రతి మెడికల్ అధికారి వారి ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగే శాంపిల్స్ సేకరణ, కొవిడ్ పరీక్షలు జరిగే ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇతర వైద్య సేవలన్నీ యథాతథంగా కొనసాగించాలని సీఎస్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్'