చేనేత కార్మికులకు తోడ్పాటు అందించి వారి ఉపాధికి భరోసా కల్పించే లక్ష్యంతో ఏర్పాటైన ఆప్కో(apco).. ఆచరణలో దారి తప్పుతోంది. ఈ సంస్థ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు చేనేత కార్మికులకు శరాఘాతంగా మారుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాం వస్త్రాన్ని పవర్‌లూమ్ పరిశ్రమ నుంచి కొనేందుకు బైలాను సవరించేలా ఆప్కో అడుగులు వేస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల చేనేత సంఘాల నేతలతో బైలా సవరణపై సమావేశాలు నిర్వహించారు. నవంబర్ మొదటి వారంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి ఆమోదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జరిగితే నేతన్నల ఉపాధికి గండిపడటం ఖాయంగా(apco negligence on handloom workers) కనిపిస్తోంది.
వ్యాపార దృక్పథంతో ముందుకు..
రాష్ట్రవ్యాప్తంగా ఆప్కో పరిధిలో 800కు పైగా చేనేత సంఘాలున్నాయి. ఒక్కో సంఘం పరిధిలో 100 నుంచి 1000 మంది వరకు కార్మికులు సభ్యులుగా ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీరలను, యూనిఫాం వస్త్రం (లివరీ ఉత్పత్తి), దుప్పట్లు, బెడ్‌షీట్లు, ధోవతి, పంచెలు, ఇతర వస్త్రాలను నేస్తున్నారు. చేనేత పరిశ్రమ కరోనాతో ఆర్థికంగా కుదేలైంది. ఇలాంటి పరిస్థితుల్లో పవర్‌లూమ్ నుంచి యూనిఫాం వస్త్రాలు కొనుగోలు చేస్తే కార్మికులకు అది పిడుగుపాటే అవుతుంది. చేనేత కార్మికులు నేసిన వస్త్రాన్ని మార్కెటింగ్ చేసి వచ్చిన ఆదాయంలో నిర్వహణ ఖర్చులు పోనూ మిగిలిన మొత్తాన్ని తిరిగి వారి సంక్షేమానికే ఆప్కో వెచ్చించాలి. కానీ చేనేతలను వదిలేసి వ్యాపార దృక్పథంతో ముందుకెళుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. చేనేతల దగ్గర ఉన్న లివరీ ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కొన్న తర్వాతే పవర్‌లూమ్‌ల నుంచి సేకరిస్తామని సంఘాలతో నిర్వహించిన సమావేశాల్లో ఆప్కో అధికారులు చెబుతున్నారు. అయితే ఆచరణలో ఏ మేరకు కట్టుబడతారన్నది పెద్ద ప్రశ్నే. ఆప్కో బైలాను సవరించాలనుకుంటున్నామని, అవసరమైన యూనిఫాం వస్త్రాన్ని చేనేత సంఘాలు సరఫరా చేయలేకపోతున్నందున దానిపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు ఆప్కోలోని ఒక ఉన్నతాధికారి తెలిపారు. నవంబర్‌లో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ప్రతిపాదించే విషయంపై ఆలోచిస్తున్నామని వివరించారు. ఎలా సవరించాలనే దానిపై ఇంకా నిర్ణయం (apco negligence for create employment to handloom workers) తీసుకోలేదన్నారు.
ప్రోత్సహిస్తే సాధ్యమేగా?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఏకరూప దుస్తులకు కోటి మీటర్ల వరకు వస్త్రం అవసరమవుతుందని అధికారుల అంచనా. ఇందులో ప్రస్తుతం 20 లక్షల మీటర్ల వరకు చేనేత సంఘాల నుంచి తయారవుతుందని లెక్కగడుతున్నారు. ప్రభుత్వ అవసరాలకు తగ్గస్థాయిలో యూనిఫాం వస్త్రం నేయడం లేదనే కారణంతో పవర్‌లూమ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆప్కో వాదన. ఒక ఏడాది ముందే చేనేత సంఘాలే తయారీ చేపట్టేలా ఆప్కో ఆర్డర్లు ఇస్తే వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వస్త్రాన్ని విద్యార్థులకు అందించవచ్చు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు దాదాపుగా రూ.300-400 కోట్ల విలువైన పని దొరుకుతుంది. అలా కాకుండా పవర్‌లూమ్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి..