కరోనా వైరస్ గురించి తాను గతంలోనే చెప్పానని.. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. తనకు చెందిన భవనాలను వినియోగించుకోవాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరితే సరైన స్పందన రాలేదన్నారు. అమెరికాలో ఉన్న ఆయన తన సందేశాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు.
రఘురామకృష్ణరాజుపై సంచలన ఆరోపణలు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తనను చంపించాలని చూసినట్టు సంచలన ఆరోపణలు చేశారు. తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఏడాది కాలంగా గొడవలు తప్ప.. ఆయన చేసిన అభివృద్ధి ఏదీ లేదన్నారు. తనను గెలిపించి ఉంటే.. అభివృద్ధి అంటే ఏంటో చూపించేవాడినని చెప్పారు.
'కేసీఆర్ ఆరోగ్యం కోసం ప్రార్థించా'
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కరోనా సోకిందని విన్నట్టు చెప్పిన ఆయన.. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేశానన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
'62 దేశాలతో కలిసి పని చేస్తున్నా'
కరోనా నుంచి ప్రపంచాన్ని విముక్తం చేసేందుకు తాను 62 దేశాలతో కలిసి పని చేస్తున్నట్టు పాల్ తెలిపారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలు తనతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు మీడియాలో తన సందేశానికి చోటు లేదని ఆవేదన చెందారు.