APTSA On Employees Agitation: పీఆర్సీ నివేదిక, అమలు తదితర అంశాలపై ఉద్యోగం సంఘాల జేఏసీ ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ ప్రకటించింది. పది రోజుల్లోగా పీఆర్సీని ప్రకటిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసినందున.. తాము నిరసన కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని వెల్లడించారు. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, రమణ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. రేపటి నుంచి చేసే నిరసన కార్యక్రమాల్లో పాల్గొన వద్దంటూ తమ ఉద్యోగులకు ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ సమాచారం పంపింది.
రెండు వర్గాలుగా ఉద్యోగులు!
ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్‌లోని ఉద్యోగులు 2 వర్గాలుగా విడిపోయారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఓ వర్గం ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని మరో వర్గం ప్రకటన జారీ చేసింది.
అధికారులు పాల్గొనవద్దు - ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం
పీఆర్సీ అమలుపై కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన నిరనసలో పాల్గోనబోవటం లేదని ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం ప్రకటన జారీ చేసింది. ఉద్యోగులు, అధికారుల సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరానికి పూర్తి విశ్వాసముందని గెజిటెడ్ అధికారుల సంఘం తెలియచేసింది. పీఆర్సీ అమలుకు సంబంధించి ఇటీవల సీఎం చేసిన ప్రకటన నేపథ్యంలో నిరసనకు దిగటంలో అర్ధం లేదని పేర్కొంది. గెజిటెడ్ అధికారులెవరూ ఆయా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన నిరసన కార్యక్రమంలో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.
మరోవైపు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగి రాకుంటే.. రెండోదశలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఏపీజేఏసీ, ఏపీఎన్జీవో సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదని.. గత్యంతరం లేకనే రోడ్డు మీదకు వచ్చామని ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. 13 లక్షల మంది డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Jagan assets case: అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దు - సీబీఐ