Amaravati capital: ఇదీ అమరావతి అభివృద్ధిపై హైకోర్టు చెప్పింది. ప్రభుత్వం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు మూడు ముక్కలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని, రాజధాని అమరావతి నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిందేని... ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆర్నెళ్ల గడువు నేటితో ముగిసింది. కానీ.... న్యాయస్థానం తీర్పు అమలుకు అతీగతీలేదు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించరాదనే మంకు పట్టుపట్టిన వైకాపా సర్కార్ అమరావతి పనుల్ని అంగుళం కూడా కదిలించలేదు. దానికి సాక్ష్యమే ఈ దృశ్యాలు.! హైకోర్టు తీర్పు అమలు చేసి ఉంటే దారులింత దారుణంగా ఉండేవా.? కంపచెట్లు కమ్మేసేవా.? ఠీవీగా నిలబడాల్సిన నిర్మాణాలు ఇలా మొండిగోడలకే మిగిలిపోయేవా..? కోట్ల విలువైన నిర్మాణ సామగ్రి తుప్పుపట్టేదా? గతంలోనే. 80 శాతం పూర్తైన ఉద్యోగుల నివాస సముదాయాలు.. ఇలా నిర్మానుష్యమయ్యేవా..?
నెలరోజుల్లో అమరావతిలో మౌలిక వసతులు కల్పించాలని... హైకోర్ట్ తీర్పులో పేర్కొంది. అంటే రోడ్లు అభివృద్ధి చేయాలి, డ్రైనేజ్ లైన్లు వేయాలి, విద్యుత్ సదపాయాలుండాలి. కానీ ఎటుచూసినా కంపచెట్లేతప్ప.. అభివృద్ధి ఆనవాళ్లే ఇక్కడ కనిపించడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం పెరిగినట్లే రైతులప్లాట్లలో తుమ్మచెట్లు కూడా బాగా పెరిగి పెద్దవైపోయాయి. రైతులకు కేటాయించిన ప్లాట్లను సీఆర్డీఏ 12జోన్లుగా విభజించింది. సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్... రెండుసార్లు రాజధానిలో పర్యటించి ప్లాట్ల అభివృద్ధి పనులపై హడావుడి చేశారు. మొదటగా ప్లాట్లకు వెళ్లే దారి కోసం కంపచెట్లు తొలగించే పనులు మాత్రమే చేపట్టారు. తీరా చూస్తే ఒకే ఒక జేసీబీతో ఆ పనులు జరుగుతున్నాయి. 60వేల ప్లాట్ల అభివృద్ధికి ఒక జేసీబీ అంటే.. ఇక ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో చెప్పనక్కర్లేదు. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ పదేపదే నోటీసులు పంపిన సీఆర్డీఏ అధికారులు... కనీసం రోడ్లు కూడా వేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు తీర్పు తర్వాత కేవలం రాయపూడి సమీపంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న భవనాల వద్ద మాత్రమే కొన్ని పనులు తిరిగి ప్రారంభించారు. అవి కూడా తూతూమంత్రంగా మొదలుపెట్టారు. బృహత్ ప్రణాళిక ప్రకారం గత ప్రభుత్వం ప్రారంభించిన నిర్మాణాలనే గాలికొదిలేసింది ప్రస్తుత ప్రభుత్వం. శాశ్వత సచివాలయం, హైకోర్టు, న్యాయమూర్తుల నివాసాల పనులు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో... నేటీకీ అలాగే ఉన్నాయి. కొన్ని నిర్మాణ ప్రాంగణాలైతే చెరువుల్ని తలపిస్తున్నాయి. నిర్మాణ సామాగ్రి, వాహనాలు, యంత్రాలు ఇలా తుప్పుపట్టాయి.
మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు 4 కి.మీ.ల మేర ఆగిపోయిన సీడ్‌యాక్సెస్ రోడ్డు పనులు పూర్తిచేయలేదు. పైగా తామేదో చేస్తున్నామనే భ్రమకల్పించేందుకు కరకట్ట రోడ్డు విస్తరణకు కొబ్బరికాయకొట్టారు. కరకట్ట రోడ్డు చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ ఎత్తుకు మట్టి తోలడం, విస్తరించడం కంటే సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేయడమే తేలికనే విషయాన్ని విస్మరిస్తోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం కనీసం మౌలిక వసతులు కల్పించి ఉంటే.. రాజధానిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా త్వరగా వెళ్లే వీలుండేది. భూములు కొనుగోలుచేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థలూ, ప్రైవేటు కంపెనీలు నిర్మాణాలు మొదలుపెట్టేవి. కానీ అది జరగలేదు సరికదా ఉన్నరోడ్లను దొంగలు తవ్వేసుకుని కంకర, ఇనుము, ఇతర నిర్మాణ సామాగ్రి ఎత్తుకెళ్తున్నా.. నిలువరించలేకపోయారు. కోర్టుల్నీ లెక్కపెట్టకపోతే ఇక తాము ఎవరికి చెప్పుకోవాలని రైతులు ఆక్రోశిస్తున్నారు.
ఆర్థిక సమస్యల సాకుతో కోర్టు కళ్లుగప్పే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం...! నిధులు సమకూర్చుకునేందుకు బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నామని నవులూరులోని అమరావతి టౌన్‌షిప్‌లో ఫ్లాట్లు వేలం వేస్తే రూ.330 కోట్లు వస్తుందని, దానితో రాజధానిలో అభివృద్ధి పనులు చేస్తున్నామని పురపాలకకార్యదర్శి శ్రీలక్ష్మి అఫిడవిట్‌లో కోర్టుకు తెలిపారు. ఐతే 30 వేలమందికార్మికులతో రేయింబవళ్లు పనులు సాగిన అమరావతిలో.. ఇప్పుడు నిశ్శబ్ధవాతావరణం రాజ్యమేలుతుంటే.. బ్యాంకులు ఏ ధైర్యంతో అప్పులిస్తాయి.? చివరకు సీఆర్డీఏ స్థలాలు అమ్ముదామన్నా కొనడానికి ఎవరూ రావడం లేదు. ప్రభుత్వం మాత్రం బ్యాంకులు అప్పిస్తేనే ఖర్చు పెడతామనే వైఖరి ప్రదర్శిస్తోంది. ఐతే మూడేళ్లలో సుమారు రూ.4 లక్షల కోట్ల రూపాయలకుపైనే అప్పులు చేసిన ప్రభుత్వం... వాటిలో 10 వేల కోట్లు రాజధానికి వెచ్చించినా.. మౌలిక వసతులు పూర్తయ్యేవి కదా అనే రైతుల ప్రశ్నలకు... సమాధానం చెప్పలేకపోతోంది. రాజధాని రైతులకు కౌలు, పింఛను చెల్లించేందుకు తప్ప... అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వెచ్చించడం లేదు. అసలు ప్రభుత్వానికి అమరావతిని అంతం చేయడమే తప్ప.. అభివృద్ధి చేయాలనే ఉద్దేశమే లేదని రైతులు మండిపడుతున్నారు.
భూసమీకరణ పథకం నిబంధనల ప్రకారం సీఆర్‌డీఏకు, రైతులకు మధ్య కుదిరిన చట్టబద్ధ ఒప్పందాన్ని అతిక్రమించడానికి వీల్లేదని.. హైకోర్టు తీర్పులో తేల్చిచెప్పింది. కానీ.. ప్రభుత్వం మాత్రం... ఇంకా మూడు రాజధానులపేరుతో.. అమరావతిని త్రిశంకుస్వర్గంలో ఉంచడం.. కోర్టు ధిక్కరణేనని న్యాయవాదులు అంటున్నారు.
ఇవీ చదవండి: