పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. లెక్కింపులో రెండంకెల ఫలితాలు వచ్చిన చోట కొన్ని తప్పులు జరిగాయని ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ఈ ఫిర్యాదులపై కలెక్టర్లు, జిల్లా ఎలక్షన్ అధికారుల నుంచి వివరణాత్మక నివేదికలు తెప్పించామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో ముఖ్యంగా నాలుగు చోట్ల వచ్చిన ఫిర్యాదులపై రెండోసారి కూడా లోతుగా విచారణ చేశారని వివరించారు. కలెక్టర్లు ఇచ్చిన వివరణలను ఎస్ఈసీ అంగీకరించిందన్నారు. గుంటూరు జిల్లాలోని పిడపర్తిపాలెం, వెనిగండ్ల, పెదకూరపాడు, పోతుమర్రు పంచాయితీల కంప్లైంట్ల విషయంలో పూర్తి సమాచారం సేకరించామని పేర్కొన్నారు. రీపోలింగ్ నిర్వహించాల్సిన స్థాయిలో తీవ్రమైన సంఘటనలు ఏమీ జరగలేదని చెప్పారు. ఎస్ఈసీ పూర్తి విచారణ తర్వాత ఎలాంటి అవాంఛనీయమైన ఘటన జరగలేదని ధ్రువీకరిస్తోందన్నారు.
ఇదీ చదవండి