ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న తేదీలను ఆయన వెల్లడించారు. ఈనెల 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు.
ఫిబ్రవరి 5న తొలిదశ ఎన్నికలు, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది.
ముఖ్యమైన తేదీలివే
- తొలి దశ
నోటిఫికేషన్ జారీ- జనవరి 23
నామినేషన్ల స్వీకరణ- జనవరి 25
నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - జనవరి 27
నామినేషన్ల పరిశీలన- జనవరి 28
నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 31
ఎన్నికల పోలింగ్ - ఫిబ్రవరి 5 (ఓట్ల లెక్కింపు అదే రోజు)
- రెండో దశ
నోటిఫికేషన్ జారీ- జనవరి 27
నామినేషన్ల స్వీకరణ- జనవరి 29
నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - జనవరి 31
నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 1
నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 4
ఎన్నికల పోలింగ్ - ఫిబ్రవరి 9 (ఓట్ల లెక్కింపు అదే రోజు)
- మూడో దశ
నోటిఫికేషన్ జారీ- జనవరి 31
నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 2
నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - ఫిబ్రవరి 4
నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 5
నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 8
ఎన్నికల పోలింగ్ - ఫిబ్రవరి 13 (ఓట్ల లెక్కింపు అదే రోజు)
- నాలుగో దశ
నోటిఫికేషన్ జారీ- ఫిబ్రవరి 4
నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 6
నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - ఫిబ్రవరి 8
నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 9
నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 12
ఎన్నికల పోలింగ్ - ఫిబ్రవరి 17 (ఓట్ల లెక్కింపు అదే రోజు)
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏడాది కాలంగా వివాదం నడుస్తోంది. కరోనా కారణంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్ఈసీ కిందటి ఏడాది మార్చిలో రద్దు చేశారు. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా నోటిఫికేషన్‌ను రద్దు చేశారని సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తప్పుబట్టారు. ఆ తరువాత ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా తెచ్చింది. దాని ప్రకారం ఎస్ఈసీగా రమేష్ కుమార్‌ను తప్పించి జస్టిస్ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. దీనితో మళ్లీ ఎస్ఈసీగా రమేష్ కుమార్ కొనసాగుతున్నారు.
ముదిరిన వివాదం...
అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య వివాదం ముదిరింది. ఆ తరువాత నుంచి ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ ప్రయత్నాలు చేస్తున్నా... ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూనే ఉంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఎన్నికల నిర్వహణకు తాము సుముఖంగా లేమని ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జరిగిన విచారణలో ప్రభుత్వం ఇదే వాదన చేస్తూ వచ్చింది.
''ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించమని సుప్రీంకోర్టు సూచించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహకరించడం లేదని'' ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం ఎస్ఈసీని కలవాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు సూచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌లు ఎస్ఈసీని కలిశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉన్నందున ఇప్పట్లో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా లేమని చెప్పారు.
వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది లేదు..
కరోనా వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డంకి కాదని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కేటగిరీ-1, కేటగిరీ-2 కింద ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్ చేయనుందని... ఈ కేటగిరి-1లో 3.7లక్షల మంది, కేటగిరీ-2లో 7 లక్షల మంది మాత్రమే రాష్ట్రంలో ఉన్నారని, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.