పారదర్శకత పాటించే అంశంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి దేశంలో తొలిస్థానంలో నిలిస్తే.. ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ మండళ్లు ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో, మాన్యువల్‌గా పెద్దఎత్తున డేటా సేకరిస్తున్నప్పటికీ వాటిని ప్రజాబాహుళ్యానికి వెల్లడించడంలో గోప్యత పాటిస్తున్నాయి. ఏయే రాష్ట్రాలు తమ ప్రజలకు అధిక సమాచారాన్ని అందిస్తున్నాయన్న విషయమై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ గురువారం ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో 67% మార్కులతో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఒడిశాతో కలిసి తొలి స్థానాన్ని ఆక్రమించగా, 52% మార్కులతో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానానికి పరిమితమైంది.
కర్ణాటక, తెలంగాణ, దిల్లీ, గుజరాత్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, మిజోరం పీసీబీ వెబ్‌సైట్‌లలో మాత్రమే ప్రజాభిప్రాయాన్ని వినిపించడానికి విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. కాలుష్యకారక వ్యవస్థలకు జారీచేసిన ఆదేశాలు, షోకాజ్, మూసివేత నోటీసులను తెలంగాణతోసహా రాజస్థాన్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ పీసీబీలు మాత్రమే వెబ్‌సైట్‌లలో ఉంచుతున్నట్లు తెలిపింది. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై చర్చించడానికి ప్రతి పీసీబీ కనీసం మూడునెలలకోసారైనా సమావేశం కావాలి.
దిల్లీ, గోవా, త్రిపుర, ఉత్తరాఖండ్ బోర్డులు మాత్రమే ఇలాంటి సమావేశాల మినిట్స్‌ను అప్‌లోడ్ చేశాయి. తాజా వార్షిక నివేదికలను 12 రాష్ట్రాలు మాత్రమే వెల్లడించాయి. అందులో తెలుగు రాష్ట్రాలు లేవు. ఇకపై పీసీబీలు ప్రచురించే వార్షిక నివేదికలన్నీ ఒకే ఫార్మట్‌లో ఉండేలా చూడాలని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సిఫార్సు చేసింది. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీ చేయాలంది. బహిరంగ విచారణలు, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాలని స్పష్టం చేసింది.