AP rank in crime rate: రాష్ట్రంలో నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నాలుగైదేళ్ల కిందట వరకూ అతి తక్కువ నేరాల రేటు కలిగిన రాష్ట్రాల జాబితాలో కొనసాగిన ఏపీ.. ఇప్పుడు అత్యధిక నేరాల రేటు కలిగిన రాష్ట్రాల సరసన చేరింది. 2019లో రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 278.6 నేరాలు నమోదు కాగా.. 2020లో ఆ సంఖ్య 452.7కు పెరిగింది. ఏడాది వ్యవధిలోనే నేరాల రేటు ఏకంగా 162.49 శాతం పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న నేరాల తీవ్రతకు గణాంకాలు అద్దం పడుతున్నాయి. 2016 నుంచి 2019 వరకూ ఏపీలో నేరాల రేటు 250.1 నుంచి 283.9 మధ్యే ఉంది. కానీ 2020లో 452.7కు చేరింది. ఈ స్థాయిలో నేరాల రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా కేంద్ర హోంశాఖ రాజ్యసభలో వెల్లడించిన గణాంకాల్ని విశ్లేషిస్తే అత్యధిక నేరాల రేటు కలిగిన రాష్ట్రాల జాబితాలో గతంలో 11-13వ స్థానాల్లో ఉన్న ఏపీ 2020లో ఆరో స్థానానికి ఎగబాకింది. పొరుగున ఉన్న తెలంగాణలో నేరాల సంఖ్య, రేటు కూడా ఏపీతో పోలిస్తే తక్కువగా ఉంది.
తొలిసారి 2.38 లక్షలకు చేరిన మొత్తం నేరాలు..: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో తొలిసారి మొత్తం నేరాల సంఖ్య 2,38,105కు చేరింది. 2016-19 మధ్య ఎప్పుడూ ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఆ నాలుగేళ్లలో 2017లో మాత్రమే అత్యధికంగా 1,48,002 కేసులు నమోదయ్యాయి. 2019లో రాష్ట్రంలో 1,45,751 నేరాలు నమోదు కాగా.. 2020లో ఆ సంఖ్య 2,38,105గా ఉంది. 163.42 శాతం మేర నేరాలు పెరిగాయి.
ఏటా పెరుగుతున్న అత్యాచారాలు..: రాష్ట్రంలో అత్యాచారాల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2018లో 971 అత్యాచారాలు నమోదు కాగా, 2019లో 1,086, 2020లో 1,095 నేరాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో సగటున రోజుకు మూడు అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హత్యలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. 2019లో 870 హత్యలు జరగ్గా.. 2020లో 853 నమోదయ్యాయి.
![](https://assets.eenadu.net/article_img/ap-main6b_133.jpg)
ఇదీ చదవండి: Suicide: చిత్తూరు జిల్లాలో విషాదం.. వైకాపా నేత పార్థసారథి ఆత్మహత్య