రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. వాతావరణం కొంత చల్లబడినట్లే అనిపించినా గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం అనూహ్యంగా 20 శాతం పెరిగింది. దీనికితోడు దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. జెన్‌కో థర్మల్ ప్లాంట్లు సైతం ఇదే సమస్యతో కొన్ని యూనిట్ల నుంచి ఉత్పత్తి నిలిపేశాయి. దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ పెరగటంతో యూనిట్ రూ.20 వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో కొందామన్నా దొరకటం లేదు.
(సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల) సమయంలో విద్యుత్ దొరకటం కష్టంగా ఉంది. లోడ్ సర్దుబాటు కోసం అవసరాన్ని బట్టి ఈ సమయంలో వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాలు రేడియల్ ఫీడర్లకు సరఫరా నిలిపేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో 2-3 గంటలు విద్యుత్ కోతలు తప్పడం లేదు. అప్పటికీ సర్దుబాటు కాకుంటే చిన్న పట్టణాలకు సరఫరా నిలిపేస్తున్నారు. గ్రిడ్ భద్రత కోసం కోతలు విధించక తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సాధారణంగా రోజువారీ విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి 8000- 8500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. గత నెల 18న ఇది 10,066 మెగావాట్లను తాకడం పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి నిదర్శనం.
వ్యవసాయానికీ ఇబ్బంది
ప్రస్తుతం వరితో పాటు మెట్ట పంటల సాగుకు రోజుకు కనీసం 20 ఎంయూల విద్యుత్ అవసరం. కనీసం ఫిబ్రవరి వరకు ఈ స్థాయిలో ఇవ్వకపోతే నీరందక పంటలు దెబ్బతింటాయి. అక్కడి నుంచి వేసవి మొదలవటంతో వినియోగం మరింతగా పెరుగుతుంది. రానున్న వేసవిలో రోజువారీ డిమాండ్ సుమారు 230 ఎంయూలకు చేరుతుందని అంచనా.
థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత
రాష్ట్రంలోని జెన్‌కో థర్మల్ ప్లాంట్లకు రోజుకు సుమారు 70 వేల టన్నుల బొగ్గు అవసరం. గత నెలాఖరు వరకు రోజుకు 24 వేల టన్నులే అందుబాటులో ఉంది. ప్రస్తుతం సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి రోజుకు 40 వేల టన్నుల వరకు అందుతోంది.
* బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు అక్టోబరు నుంచి 2022 జనవరి వరకు వేసవిని దృష్టిలో ఉంచుకుని బొగ్గు నిల్వలు పెంచాలి. రోజుకు కనీసం 20 రేక్‌లు (ఒక్కో రేక్‌కు 3,500 టన్నులు) వస్తే ప్రస్తుత అవసరాలు పోను వేసవి కోసం కొంత బొగ్గు నిల్వ చేసుకోగలమని ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 8-10 రేక్‌లు మాత్రమే వస్తున్నాయి.
జెన్‌కో ప్లాంట్లపై ప్రభావం
* విజయవాడలోని వీటీపీఎస్‌లోని ఏడు యూనిట్ల నుంచి 1,760 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే.. ప్రస్తుతం 1,100 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. నిర్వహణలో భాగంగా 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంటు నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది.
* కడపలోకి ఆర్టీపీపీకి 1,650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే.. 536 మెగావాట్లు మాత్రమే వస్తోంది. బొగ్గు కొరతతో కొన్ని నెలలుగా మూడు యూనిట్ల నుంచి ఉత్పత్తి నిలిపేశారు.
* కృష్ణపట్నంలో 1,600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే.. 500 మెగావాట్లు మాత్రమే వస్తోంది. బొగ్గు కొరత కారణంగా 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్ నుంచి కొన్ని నెలలుగా ఉత్పత్తి నిలిపేశారు. బొగ్గు కొరత లేకుంటే మరో 25 ఎంయూల విద్యుత్ అందుబాటులో ఉండేదని ఒక అధికారి తెలిపారు.
వీటీపీఎస్‌లో ఒక్క రోజుకే సరిపడా నిల్వలు
ప్రస్తుతం విజయవాడలోని వీటీపీఎస్‌లో 21,674 మెట్రిక్ టన్నులు (ఎంటీ), కడపలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ)లో 62,506 ఎంటీలు, నెల్లూరులోని కృష్ణపట్నంలో 75,427 ఎంటీల బొగ్గు నిల్వలు ఉన్నాయి. వీటీపీఎస్‌లో ఒకరోజుకు విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. ఆర్టీపీపీˆలో ఉన్న నిల్వలు 3 రోజులకు, కృష్ణపట్నంలో ఉన్నవి 5 రోజులకు మాత్రమే సరిపోతాయి.
రెండేళ్లలో ఇదే గరిష్ఠ ధర
ఈ నెల ఒకటిన విద్యుత్ డిమాండ్ 189.609 మిలియన్ యూనిట్లు (ఎంయూ)గా ఉంది. ప్రస్తుతం 176.058 ఎంయూలకు తగ్గినా గత మూడు రోజులూ 1- 3 ఎంయూల కొరత ఏర్పడింది. డిమాండ్ సర్దుబాటు కోసం విద్యుత్ సంస్థలు 40 ఎంయూలను బహిరంగ మార్కెట్ నుంచి కొంటున్నాయి. గత నెల 15 వరకు యూనిట్ విద్యుత్ ధర సగటున రూ.4-5 మధ్య ఉంది. మూడు రోజులుగా బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరగటంతో అది రూ.15కు చేరింది. గత రెండేళ్లలో ఎప్పుడూ ఇంత ధర పెట్టి కొనలేదని ఓ అధికారి తెలిపారు. బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్‌సీ యూనిట్‌కు రూ.3.86 వంతున టారిఫ్ ఆర్డర్‌లో అనుమతించింది. అందుకు మూడు, నాలుగు రెట్లు అధికంగా వెచ్చించాల్సి రావటం గమనార్హం.
ఇదీ చదవండి: Clash: తేతలిలో అధికార పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ.. పోలీసుల పహారా