NGO: ఉద్యోగ, ఉపాధ్యాయులకు 11వ పీఆర్‌సీ బకాయిలు పదవీ విరమణ కంటే ముందే దశలవారీగా చెల్లించాలని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కేవీ శివారెడ్డి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోపాటు జేఏసీలోని కొన్ని సభ్య సంఘాల ప్రతినిధులతో కలిసి వారు గురువారం సీఎంను కలిశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై విడివిడిగా 12 విజ్ఞాపనలను ముఖ్యమంత్రికి అందజేశారు. పీఆర్‌సీ బకాయిలు ఉద్యోగ విరమణ తరువాత చెల్లించాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని బండి శ్రీనివాసరావు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఫిట్‌మెంట్ 27% వచ్చేలా చర్యలు తీసుకుని ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించాలని కోరారు.
సీఎంకు ఇచ్చిన విజ్ఞాపనల్లో మరికొన్ని ఇతర డిమాండ్లు..
* గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల కార్యవర్గ సభ్యులను తొమ్మిదేళ్లపాటు బదిలీ చేయకూడదనే ఉత్తర్వులను పునరుద్ధరించాలి.
* పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు కూడా 62 ఏళ్ల వయోపరిమితిని వర్తింపజేయాలి.
* సీపీఎస్‌ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.
* గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి.
* కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
* ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు జీపీఎఫ్, మెడికల్ బిల్లులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వచ్చే ఆర్థిక రాయితీలు, ఏపీ జీఎల్‌ఐ, జీఐఎస్ బకాయిలు, పోలీసులకు సరెండర్ లీవ్ మొత్తాలు చెల్లించాలి.
* పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగులకు 11వ పీఆర్‌సీ వర్తింపజేయాలి.
* క్షేత్రస్థాయి సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయించాలి.
ఇవీ చదవండి: