రానున్న నాలుగేళ్లలో ఓడరేవుల (పోర్టుల) ద్వారా 30 కోట్ల టన్నుల సరకు రవాణా సామర్థ్యానికి చేరుకోవాలని ఏపీ మారిటైం బోర్డు భావిస్తోంది. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలను రూపొందించింది. నాలుగు కొత్త పోర్టులను వినియోగంలోకి తేవాలని యోచిస్తోంది.
రామాయపట్నం(ప్రకాశం), భావనపాడు(శ్రీకాకుళం), మచిలీపట్నం(కృష్ణా), కాకినాడ ఎస్‌ఈజడ్ పోర్టులను పూర్తి చేయటానికి ప్రణాళికలను రూపొందించింది. రామాయపట్నం ఓడరేవు మొదటి దశ అభివృద్ధికి రూ.2,646.84 కోట్లతో పనులు చేపట్టడానికి వీలుగా ఇప్పటికే టెండర్లను పిలిచింది. ఈ నెలాఖరుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. భావనపాడు ఓడరేవును రూ.2,573.15 కోట్లతో అభివృద్ధి చేయటానికి టెండర్లను పిలిచింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల ఆధారంగా తగిన మార్పులు చేసి మళ్లీ పర్యావరణ అనుమతుల కోసం పంపాల్సి ఉంది. మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి రూ.5,835 కోట్లతో రైట్స్ సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను ఆమోదించింది.
రాష్ట్రంలోని మూడు ప్రైవేటు పోర్టుల ద్వారా గత ఏడాది (2019-20) 9.76 కోట్ల టన్నుల సరకు రవాణా ద్వారా రూ.3,601.61 కోట్ల స్థూల ఆదాయం వచ్చింది. ఇందులో కాకినాడ డీప్‌వాటర్ పోర్టు యాజమాన్యంతో ఉన్న రాయితీ ఒప్పందం మేరకు ఆదాయంలో 22 శాతం వంతున రూ.117.48 కోట్లు, గంగవరం పోర్టు ఆదాయంలో 2.1 శాతం వంతున రూ.23.14 కోట్లు, కృష్ణపట్నం నుంచి 2.6 శాతం వంతున రూ.48 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది.
ఇదీ చదవండి:
తుది దశకు చేరిన పల్లె పోరు.. రేపు నాలుగో దశ ఎన్నికలకు పోలింగ్