రాష్ట్ర శాసనమండలి భవితవ్యం తేలిపోయింది. పెద్దలసభ రద్దుకే మొగ్గు చూపిన అధికార పార్టీ.. శాసనసభలో మండలి రద్దుకు అనుకూలంగా రాజ్యాంగ తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్‌లో మూడింట రెండొంతులకు మించి సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో....శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు సభాపతి ప్రకటించారు.
శాసనమండలి రద్దు తీర్మానం సందర్భంగా నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియలో స్వల్ప గందరగోళం నెలకొంది. తీర్మానానికి అనుకూలంగా తొలుత 121 మంది సభ్యులు ఓటేశారని సభాపతి ప్రకటించినా... అధికారపార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరోసారి లెక్కించి తీర్మానానికి 133 మంది ఓటేసినట్లు వెల్లడించారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సైతం తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. తెలుగుదేశం సభ్యులు సభకు హాజరుకానందున.. తీర్మానానికి వ్యతిరేకంగా, తటస్థంగా ఒక్క ఓటు నమోదు కాలేదు.
కీలకమైన శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్‌కు 18 మంది వైకాపా సభ్యులు గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది. వైకాపాకు 151 మంది సభ్యులు ఉండగా....సభాపతిని మినహాయిస్తే....150 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనాలి..జనసేన సభ్యుడితో కలిపి వచ్చిన ఓట్లు 133 కావడంతో 18 మంది అధికార పార్టీ సభ్యులు వివిధ కారణాలతో ఓటింగ్‌లో పాల్గొనలేదని తేలింది.
ఇదీ చదవండి: మండలి రద్దు..! తీర్మానానికి శాసనసభ ఆమోదం