High court on Public Representatives Cases : ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో ఉపసంహరణ/ ఎత్తివేత కోసం ఎన్నింటిని ప్రతిపాదించారు, ఎన్ని జీవోలు ఇచ్చారు తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఎన్ని కేసుల ఉపసంహరణకు అభ్యర్థనలు వచ్చాయో నివేదిక అందజేయాలని.. విజయవాడలోని ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయాధికారికీ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టుల అనుమతి లేకుండా ప్రజాప్రతినిధులపై కేసుల ఎత్తివేత కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల ఉపసంహరణ విషయంలో హైకోర్టు సుమోటోగా వ్యాజ్యం నమోదు చేసింది.
నివేదికలు ఇవ్వండి...
దీనిపై బుధవారం విచారణ జరిపింది. నివేదికలు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా తీర్పులివ్వాలని కోరుతూ భాజపా నాయకుడు అశ్వినీకుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టుల అనుమతి లేకుండా ప్రస్తుత, పూర్వ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ కుదరదని ఈ ఏడాది ఆగస్టు 25న ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.
సుమోటోగా కేసు...
High court on Public Representatives Cases : ఈ నేపథ్యంలో 2020 సెప్టెంబర్ 16 నుంచి 2021 ఆగస్టు 25లోపు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసుల ఉపసంహరణకు జీవోలు ఇచ్చారు తదితర వివరాల్ని పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. వైకాపా ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చర్యలు తీసుకునేలా సిఫారసు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన 9 జీవోలను వ్యాజ్యంలో ప్రస్తావించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ (లీగల్-2) ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, డీజీపీ, ప్రాసిక్యూషన్ డైరెక్టర్, గుంటూరు, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొంది.
ఇదీ చూడండి:
TIRUMALA: తిరుమల కనుమదారిలో విరిగిపడ్డ కొండచరియలు.. రెండో ఘాట్‌రోడ్ మూసివేత