నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఖాళీపోస్టుల భర్తీ విషయమై పాదయాత్ర నిర్వహించి ముఖ్యమంత్రిని కలిసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఏలూరు పట్టణం శనివారపుపేటకు చెందిన కారంపూడి విజయ్ పాల్.. హైకోర్టును ఆశ్రయించారు. కొవిడ్ వ్యాప్తి కారణం, వారి వివరాలు సమర్పించలేదని తదితర కారణాలతో పోలీసులు అనుమతి నిరాకరించారని కోర్టుకు విన్నవించారు. పాదయాత్రకు అనుమతిచ్చేందుకు కొవిడ్‌కి సంబంధం లేదన్నారు. శాంతియుతంగా పాదయాత్ర, నిరసన తెలియజేసే ప్రాథమిక హక్కు తనకు ఉందన్నారు.
కొవిడ్ పేరుతో పాదయాత్రకు అనుమతి నిరాకరించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. పాదయాత్ర చేయడానికి రూటామ్యాప్, ఆయనతో పాల్గొనేవారి పూర్తి వివరాలు పోలీసులకు సమర్పిస్తానని పిటిషనర్ అంగీకరించారని తెలిపింది. అన్ని వివరాలతో పిటిషనర్ వినతి సమర్పిస్తే దానిని పరిగణనలోకి తీసుకొని నిష్పాక్షిత దృక్పథంతో తక్షణమే అనుమతి ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎఎస్ సోమయాజులు ఈ మేరకు తీర్పు వెల్లడించారు.
ముఖ్యమంత్రిని కలవాలనుకునే వ్యక్తుల పూర్వ వివరాలను పోలీసులు జాగ్రత్తగా పరిశీలిస్తారని.. హోంశాఖ తరపు న్యాయవాది మహేశ్వర రెడ్డి వాదనలు వినిపించారు. పాదయాత్రలో పిటిషనర్‌తోపాటు పాల్గొనే 11 మంది వివరాలను సమర్పించలేనందున.. అనుమతి నిరాకరణ సక్రమమేనన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. కొవిడ్ పేరుతో అనుమతి నిరాకరించడం సరికాదన్న పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. అన్ని వివరాలతో పిటిషనర్ వినతి సమర్పిస్తే నిష్పాక్షిత దృక్పథంతో తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది.
ఇదీ చదవండి: Amara Raja Group Lands: అమరరాజా భూములపై యథాతథ స్థితి కొనసాగించాలి: హైకోర్టు