నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన స్థలంలో వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతి కోసం జాతీయ మెడికల్ కౌన్సిల్(NMC)కు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటామని ఆ దరఖాస్తులో పేర్కొనాలంది. మరోవైపు పరిశోధన కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు విషయంలో గతంలో తామిచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టంచేసింది. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదే శాలిచ్చింది.
పరిశోధక కేంద్రానికి చెందిన 50 ఎకరాలను వైద్య కళాశాల ఏర్పాటుకు బదలాయించడాన్ని సవాలు చేస్తూ.. రైతులు బొజ్జా దశరథరామిరెడ్డితోపాటు మరో నలుగురు, న్యాయవాది ఎన్.ఆదిరామకృష్ణుడు వేర్వేరుగా హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాలు తాజాగా హైకోర్టులో విచారణకు వచ్చాయి. వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతి కోరేందుకు జులై 7న చివరి తేదీ అని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వానికి ధర్మాసనం వెసులుబాటు ఇచ్చింది.
ఇదీ చదవండి: వాలంటీర్లంతా.. వైకాపాకు సమాచారాన్ని చేరవేసే సైనికులు: మంత్రి అంబటి