జగనన్న విద్యా దీవెన రుసుములను(AP High Court On Jagananna Vidya Deevena) విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో కాకుండా.. కళాశాలల జాతాలో వేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇరువురి న్యాయవాదుల వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు జస్టిన్ కె.విజయలక్ష్మి ప్రకటించారు. కళాశాలలో చదివే అర్హులైన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించే ఫీజు రీయింబర్స్మెంట్, రసుములను తల్లులు బ్యాంకు ఖతాలో జమ చేయడాన్ని తప్పుపట్టిన హైకోర్టు.. సంబంధిత కళాశాలల ఖాతాల్లోనే జమచేయాలని ఆదేశించింది. ఆ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం విధానాన్ని మార్చుకుందని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. తల్లుల ఖాతాలో జమచేస్తే ఆయా కళాశాలల ఖాతాల్లోకి ఆ సొమ్ము చేరేలా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సమయం పడుతుందన్నారు. ఈలోపు తల్లులు సొమ్ము చెల్లించకపోతే వారం రోజుల్లో జ్ఞానభూమి పోర్టల్లో యాజమాన్యం ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. వార్డు, గ్రాము వాలంటీర్.. తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పీజు చెల్లించేలా చర్యలు తీసుకుంటారన్నారు. మూడు వారాల్లో సొమ్ము చెల్లించకపోతే యాజమాన్యమే నేరుగా ఫీజు రాబట్టుకోవచ్చు అన్నారు. పిటిషనర్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం తరపు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ప్రభుత్వ అభ్యర్థన తీర్పునే సవరించాలని కోరుతున్నట్లుందన్నారు. ప్రభుత్వం వేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యవహారంపై పునఃసమీక్షించాలని ఎలా కోరతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రివ్యు చేసేందుకు తగిన కారణాలు లేవన్నన న్యాయస్థానం.. నిర్ణయాన్ని వాయిదా వేసింది.