చదునైన/ సమతల పాదం కలిగిన వ్యక్తి సహాయ మోటర్ వాహన ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ)గా ఎంపిక అయ్యేందుకు అనర్హులని హైకోర్టు తీర్పు ఇచ్చింది. చదునైన పాదం కలిగిన వ్యక్తికి నడిచేటప్పుడు, పరిగెత్తే సమయంలో పట్టు ఉండదని తెలిపింది. అది అంగవైకల్యం కానప్పటికీ .. ఏఎంవీఐగా విధులు నిర్వహణకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది. అంతేకాక ఏఎంవీఐ పోస్టు ఒక చోట స్థిరంగా ఉండి విధులు నిర్వహించేది కాదంది . ఏఎంవీఐ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ. పిటిషనర్ చేసిన వాదనను తిరస్కరించింది. పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు ఆసక్తికర తీర్పు ఇచ్చింది.
రవాణ శాఖలో 23 ఏఎంవీఐ పోస్టుల భర్తీకి 2018 డిసెంబర్ 5న ప్రకటన జారీచేశారు. కడప జిల్లాకు రాయచోటి మండల పరిధిలోని నాగేశ్వరయ్య దరఖాస్తు చేసుకొని పరీక్ష రాశారు. రాష్ట్రం మొత్తం మీద మెరిట్ లిస్ట్‌లో రెండో స్థానం సాధించారు. తర్వాత మెడికల్ పరీక్షకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో నాగేశ్వరయ్య పేరులేకపోవడంతో విస్మయానికి గురయ్యారు. ఎందుకు ఎంపిక కాలేదని విచారించగా కుడికాలి ' చదునైన పాదం ' కారణమని అధికారులు తెలిపారు.
దీంతో హైకోర్టును ఆశ్రయించారు అతను. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. చదరపు పాదం అనేది చట్ట నిర్వచనం ప్రకారం అంగ వైకల్యం కాదని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్‌కు దివ్యాంగుల రిజర్వేషన్ వర్తించే అంశం ఉత్పన్నం కాదని పేర్కొంది. పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. చుదునైన పాదం ఏఎంవీఐగా విధులు నిర్వహణకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్న ధర్మాసనం.. వారు ఏఎంవీఐ పోస్టుకు అనర్హులని తీర్పు వెల్లడించింది.
ఇదీచదవండి: రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నందువల్లే అలా మాట్లాడా: పవన్