గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్లో తమపై నమోదు చేసిన ఎస్సీ ,ఎస్టీ కేసును కొట్టేయాలని కోరుతూ రైతులు వేసిన క్వాష్ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. రైతులపై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులను తొలగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్స్ 41 ప్రకారం సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ సెక్షన్స్ వర్తించవని కోర్టు తెలిపింది. రైతులు కులం పేరుతో దూషించలేదని..వారిని ఇరికించేందుకు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాది లక్ష్మీ నారాయణ వాదించారు. ఉద్దండరాయుని పాలెంలో 21 మంది రైతులపై తమ ఇంటిపైకి వచ్చి.. తమను దూషించారని నందిగామ వెంకట్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై అన్యాయంగా కేసు నమోదు చేశారని 21 మంది రైతులు క్వాష్ పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి
పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము: సుప్రీంకోర్టు