స్పందన కార్యక్రమంలో అందిన ఫిర్యాదులు, వినతుల ఆధారంగా సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యాన్ని హైకోర్టు ఆక్షేపించింది. స్పందన కారణంతో చాలా సివిల్ వివాదాల్ని పోలీసులు సెటిల్ చేయడం వల్లనే కోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలవుతున్న విషయం తమ దృష్టిలో ఉందని తెలిపింది. సివిల్ వివాదాల్ని సైతం స్పందనలో పరిష్కరిస్తారా..? అని ప్రశ్నించింది. స్పందన తర్వాత సివిల్ కోర్టుల కొనసాగింపు అవసరం ఏముందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ ఎవరూ వ్యాజ్యం దాఖలు చేయలేదా..? అని ప్రశ్నించింది.
మరోవైపు వ్యక్తుల అరెస్ట్ విషయంలో చట్టబద్ధ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని.. వాటిని పోలీసులు తప్పక పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఆ నిబంధనలు పాటించకపోతే సుప్రీంకోర్టు ఆదేశాల్ని నిర్లక్ష్యం చేసినట్లేనని పేర్కొంది. ప్రతిచోటా మనం పోలీసు పెండ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటున్నాం కాని.. అది వాస్తవ రూపందాల్చుతుందా..? అని వ్యాఖ్యానించింది. పోలీసుల తరఫు ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ ఎస్.ఎస్.ప్రసాద్ వాదనల కొనసాగింపునకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
పోలీసులు పలువుర్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న ఘటనల్లో ఆ వ్యక్తుల్ని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందా..? లేదా..? తేలుస్తామని ఇటీవల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.
కడప జిల్లాలో సివిల్ వివాదంలో పోలీసుల జోక్యంపై విచారణ సందర్భంగా.. 'స్పందన కార్యక్రమంపై హైకోర్టులో చర్చకు వచ్చింది. ఆ కార్యక్రమం ఉద్దేశ్యమేమిటని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ బదులిస్తూ.. సమస్యల పరిష్కార యంత్రాంగం అని తెలిపారు. ఫిర్యాదు అందాక అది సివిల్ స్వభావం ఉంటే సివిల్ ఆథార్టీలకు పంపుతారన్నారు. క్రిమినల్ స్వభావం అయితే పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. సివిల్ వివాదాల్ని సైతం పరిష్కరిస్తారా..? అని కోర్టు వ్యాఖ్యానించింది. స్పందన తర్వాత సివిల్ కోర్టుల కొనసాగింపు అవసరం ఏముందని వ్యంగంగా వ్యాఖ్యానించింది.
అరెస్ట్ విషయంలో పోలీసులు ఎలా వ్యవహరించాలో మార్గదర్శకంగా ఉండేలా కీలక తీర్పు ఇస్తే దాన్ని అనుసరిస్తామన్నారు. ప్రస్తుత వ్యాజ్యాల్లో కోర్టు విచారణ నేపథ్యంలో అధికారుల్లో అప్రమత్తత పెరిగి రూల్ బుక్ చూసుకుంటున్నారని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. అరెస్ట్ విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసిందని, సీఆర్పీసీ నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది. వాటిని పాటించని అధికారులు తమ ఆదేశాల్ని పాటిస్తారా..? అని ప్రశ్నించింది. వ్యక్తుల అరెస్ట్ తర్వాత వారి రక్షణ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్లు వెంటనే దాఖలు చేస్తున్నారని సీనియర్ కౌన్సిల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ధర్మాసనం స్పందిస్తూ.. హెబియస్ కార్పస్ వ్యాజ్యం దాఖలు చేయకపోతే ఇతర రాష్ట్రాల్లో కొన్నిసార్లు మృతదేహం దొరుకుతుందని తెలిపింది. సీనియర్ కౌన్సిల్ స్పందిస్తూ.. దేశంలో అలాంటి ఘటనలు జరగవన్నారు. ధర్మాసనం విభేదిస్తూ అలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. ఏపీలో మాత్రం జరగవని సీనియర్ కౌన్సిల్ తెలిపారు. ఈ రాష్ట్రం గురించి తాను చెప్పడం లేదని ధర్మాసనం పేర్కొంది.
ఇదీ చదవండి : పిటిషన్లపై పదే పదే వాయిదాలు సరికాదు: హైకోర్టు