శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలకు తిరుమల వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వని కారణంగా ఏ అధికారంతో ఆ పదవిలో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ దాఖలైన కోవారెంటో వ్యాజ్య విచారణార్హతపై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. నిర్ణయాన్ని వాయిదా(రిజర్వు) వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రకటించారు. మొదట విచారణార్హతపై తేల్చాకే వ్యాజ్యంలోని పూర్వాపరాల్లోకి వెళతామన్నారు .
తిరుమలకు వెళ్లిన ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వలేదని, అధికారులు సైతం చట్ట నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుఠపురం గ్రామానికి చెందిన ఎ.సుధాకర్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. వారంతా ఆయా పదవుల్లో ఎలా కొనసాగుతున్నారో వివరణ కోరాలని'కో వారెంటో' పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ సందర్భంగా.. సీఎం క్రైస్తవుడని చెప్పేందుకు మీ దగ్గరున్న ఆధారాలేమిటని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ... సీఎం ఎమ్మెల్యే స్థాయిని తాము సవాలు చేయలేదన్నారు. చట్ట ప్రకారం డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల వెళ్లినందుకే పిటిషన్ వేశామన్నారు. సీఎం క్రైస్తవుడు అనేందుకు సమాచారాన్ని సేకరించామన్నారు. సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాల్లో జగన్ మోహన్ రెడ్డిని నిందితుల జాబితాలో క్రిస్టియన్‌గా, మిగిలిన నిందితులను హిందువులుగా పేర్కొందన్నారు. సీఎం తల్లి పలు సందర్భాల్లో తన భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పారన్నారు. అందుకే సీఎం క్రైస్తవుడన్నారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని... సీఎంకు డిక్లరేషన్ అవసరం లేదంటూ ఉల్లంఘనలను ప్రోత్సహించారన్నారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చట్ట నిబంధనలను అమలయ్యేలా చూడటంలో విఫలమయ్యారన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ముఖ్యమంత్రి ఏ విధంగా అనర్హుడవుతారో పిటిషన్లో పేర్కొనలేదన్నారు. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు.
ఇదీ చదవండి