govt on apsrtc pf: ఏపీఎస్ఆర్టీసీ భవిష్య నిధి (పీఎఫ్) ట్రస్టులో ఉన్న దాదాపు రూ.1,600 కోట్ల నిధులపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలిసింది. వీటిని ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఆర్టీసీ యాజమాన్యం దీనికి మొగ్గుచూపడంలేదని చెబుతున్నారు. ఇందుకు నిబంధనలు అంగీకరించవని బదులిస్తున్నట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నిధులు, వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలను.. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలంటూ సంప్రదింపులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీఎస్‌ఆర్టీసీని కూడా పీఎఫ్ ట్రస్టు నిధుల కోసం కోరుతున్నారని తెలిసింది.
ఉద్యోగుల పీఎఫ్‌ను సొంతంగా నిర్వహించుకునేందుకు వీలుగా ట్రస్టు ఏర్పాటుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గతంలో మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగుల మూల వేతనం, కరవు భత్యం (బేసిక్, డీఏ) నుంచి 12 శాతం ప్రతి నెలా రికవరీ చేస్తారు. అంతే మొత్తాన్ని యాజమాన్యం (ప్రస్తుతం ప్రభుత్వం) వాటాగా ఇస్తుంది. యాజమాన్య వాటా నుంచి కొంత మొత్తాన్ని ఈపీఎఫ్-95 పింఛను పథకం కోసం ఈపీఎఫ్‌వోకు ఇస్తారు. మిగిలినదంతా ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టులోనే ఉంటుంది. ఇలా ట్రస్టులో ప్రస్తుతం పద్దుల ప్రకారం దాదాపు రూ.2 వేల కోట్లు ఉండాలి. గతంలో ఆర్టీసీ యాజమాన్యం జీతాల సర్దుబాటు సమయంలో పీఎఫ్ వాటాను ట్రస్టుకు సకాలంలో జమ చేయలేదు. వీటిని ఆర్టీసీ వాడుకుంది. ఈ మొత్తం రూ.850 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో కొంత కాలం కిందట ఆర్టీసీ రూ.450 కోట్లు ట్రస్టుకు జమ చేయగా, ఇంకా రూ.400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన పీఎఫ్ ట్రస్టులో ప్రస్తుతం రూ.1,600 కోట్లు ఉన్నాయి. వీటిని తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
ప్రత్యేక నిబంధనలు అడ్డు..
ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టు నిధులను, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయడానికి నిబంధనలు అంగీకరించవని ఆర్టీసీ అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని నిర్దేశిత పథకాలు, సంస్థల్లో మాత్రమే వీటిని పెట్టుబడులు పెట్టాలని, వాటిలోనే డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం. వీటికి లాక్ పీరియడ్ ఉంటుందని, మధ్యలో తీసేందుకు వీలుండదని స్పష్టం చేశారని తెలిసింది.
ఇదీ చదవండి: CM Jagan Kurnool Tour: ఈనెల 22న కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి జగన్