రాజధాని అమరావతి నిర్మాణం పూర్తిచేయడానికి ఐదేళ్లు సమయం ఇవ్వాలని..లేదంటే ఇటీవల న్యాయస్థానం విధించిన గడువులైనా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు నిర్దేశించిన గడువులోగా రాజధాని నిర్మాణం సాధ్యం కాదని తెలిపింది. ప్రభుత్వానికి పరిమిత వనరులే ఉన్నాయని.. సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలు ప్రాధాన్యత దృష్ట్యా రాజధాని నిర్మాణానికి 6 నెలలు కాకుండా 60 నెలల సమయం ఇవ్వాలని అఫిడవిట్‌లో కోరింది.
Govt Affidavit on Amaravathi Development: రాజధాని అమరావతిలో నిలిచిపోయిన ప్రధాన మౌలిక వసతుల పనులు మొదలుపెట్టడానికి..... 8 నెలల సమయం పడుతుందని..పూర్తి చేయడానికి 60 నెలలు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు చెప్పినట్లుగా నెలరోజుల్లో మౌలిక వసతులు పూర్తి చేయడం సాధ్యం కాదని తెలిపింది. రాజధాని కేసులో తీర్పు సందర్భంగా... అమరావతిలో నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలని..3నెలల్లోనే అభివృద్ధి చేసిన స్థలాలు రైతులకు ఇవ్వాలని, 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తిచేయాలని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 21 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. దానికి అనుబంధంగా 190 పేజీల పత్రాలు జతపరిచింది.
రాజధానిలో నెలరోజుల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలన్న నిబంధనను తొలగించాలని లేదా..ఐదేళ్లు గడువు ఇవ్వాలని ప్రభుత్వం అభ్యర్థించింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై న్యాయపరంగా తమ ముందున్న అవకాశాల్ని, ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నామని, ఈ లోపు కోర్టు తీర్పు అమల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ఆచరణ సాధ్యం కాని అంశాల్ని న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం కోసం అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్లు సీఎస్ తెలిపారు. కోర్టు చెప్పిన గడువులోగా రాజధాని నగరం, సీఆర్‌డీఏ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్ట్‌లు పూర్తిచేయడం సాధ్యకాదని...ప్రభుత్వం చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలు, నెరవేర్చాల్సిన లక్ష్యాలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొంది. కాబట్టి నిర్దిష్ట కాలవ్యవధి నిర్దేశించడం కానీ.. ఇంత డబ్బు ఖర్చు పెడతామని గానీ, ఇంత అభివృద్ధి చేస్తామనిగానీ చెప్పలేని పరిస్థితి ఉందన్నారు
ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని అఫిడవిట్‌లో పేర్కొంది. వివిధ స్థాయిలో నిలిచిపోయిన పనుల పునరుద్ధరణకు గుత్తేదారులతో మళ్లీ ఒప్పందాలను పునురుద్ధరించుకోవాల్సి ఉందని తెలిపింది. ఇప్పటికే ఏడుగురు గుత్తేదారులకు సమాచారం ఇచ్చామని వివరించింది. అయితే వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు వస్తాయన్న ఉద్దేశంతో... గతంలో రాజధానిలో పనులు ప్రారంభించారని..అయితే ఆ ప్రతిపాదనలేవీ ఫలవంతం కాలేదని ప్రమాణ పత్రంలో ప్రభుత్వం వెల్లడించింది.
ఈ అంశంపై ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. నిధుల కోసం బ్యాంకర్లను సంప్రదించగా....సీఆర్‌డీఏ ఆర్థిక స్థాయి, రుణం తిరిగి చెల్లించేందుకు ఉన్న వనరులు గురించి బ్యాంకర్లు సమాచారం కోరారని ప్రభుత్వం పేర్కొంది. రహదారుల అలైన్‌మెంట్, భూసేకరణ వ్యవహారంతో ముడిపడి ఉన్న వ్యవహారంలో 28 వ్యాజ్యాలు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం వివరించింది
అమరావతిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల కోసం లక్షా 9 వేల కోట్లు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టులోనే కేంద్రానికి లేఖ రాసిందని... రూ. 62 వేల625 కోట్ల అంచానాతో డీపీఆర్ సమర్పించామని ప్రభుత్వం అఫిడవిట్‌లో తెలిపింది. కేంద్రం దీనిపై స్పష్టత కోరిందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రక్రియ జరుగుతోందని వివరించింది. రాజధాని ప్రాంతంలో పనులు పూర్తి చేయడానికి రూ. 42 వేల 231 కోట్లు అవుతుందని గతంలోనే అంచనా వేశారని. 2015-19 సంవత్సరకాలానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,377 కోట్లు, 2020-2022 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,646 కోట్లును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపింది.
సీఆర్‌డీఏ సేకరించిన రూ. 5వేల 122 కోట్లు మాస్టర్ ప్లాన్ ప్రకారం విడతల వారీగా విడుదల చేయాల్సి ఉందన్నారు. అయితే బ్యాంకుల నుంచి సీఆర్‌డీఏ రూ.3 వేల కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా..ఆ మేరకు నిధులు సమకూర్చలేకపోయిందన్నారు. ఇప్పుడు మరలా ప్రభుత్వ హామీని పొడిగించాలని కోరుతూ సీఆర్‌డీఏ తాజాగా ప్రతిపాదనలు పంపిందని కోర్టుకు తెలిపింది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణానికి బ్యాంకులు రూ. 2వేల 69 కోట్లు మంజూరు చేయగా గతంలోనే రూ. 18వందల 62 కోట్లు విడుదల చేసిందని..త్వరలోనే మిగిలి నిధులు అందుతాయని తెలిపింది. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులను పూర్తి చేయడానికి 60నెలల సమయం పడుతుందని అఫిడవిట్‌లో తెలిపింది. పనులు తిరిగి ప్రారంభించడానికి సుమారు 8 నెలల సమయం పడుతుందని..రహదారులకు 16 నెలలు, నీటి సరఫరా, మురుగు నీటివ్యవస్థ, విద్యుత్ తదితర పనులకు 36 నెలలు పడుతుందన్నారు. మొత్తంగా రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి మొత్తం 60 నెలల సమయం కావాలని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.
ఉండవల్లి, పెనుమాకలో భూసేకరణకు సంబంధించి కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయని భూములిచ్చిన రైతులకు లేఅవుట్‌లు వేసి స్థలాలు ఇచ్చే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. 6,43 ఎకరాలకు సంబంధించిన రైతులకు ప్లాట్‌లు ఇచ్చేందుకు 6 నెలలు పడుతుందని తెలిపారు. భూములు అమ్మకం ద్వారా నిధులు సమకూర్చుకునే అధికారం సీఆర్డీఏకు ఉన్నా.. 2023 తర్వాతే భూములను విక్రయించే అవకాశం ఉందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి: రాజధాని అమరావతే... మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు: హైకోర్టు