ఎస్సీ కార్పొరేషన్‌లో పేరుకుపోయిన రుణ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేసే జాతీయ ఎస్సీల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ), జాతీయ సఫాయి కర్మచారీల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ) పథకాల కింద అయిదారేళ్ల కిత్రం స్వయం ఉపాధి రుణాలు పొంది సకాలంలో చెల్లించని లబ్ధిదారుల నుంచి బకాయిల వసూలుకు చర్యలు చేపట్టింది. గతంలో రవాణా, రవాణేతర విభాగం కింద స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రుణాలు పొందిన వారి నుంచి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు బకాయిలు వసూలు చేస్తున్నారు. దాదాపుగా రూ.90 కోట్లు వసూలు చేయాల్సి ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
రెండు విభాగాల్లో రుణాలు..
రవాణా విభాగం కింద కార్లు (ఇన్నోవా తదితరాలు), రవాణేతర విభాగం కింద దుస్తుల దుకాణం, ల్యాబ్, డెయిరీ, ఇతర చిన్న తరహా స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేశారు. ఇన్నోవా ఖరీదు రూ.22 లక్షలు కాగా ఇందులో 35% రాయితీ, 2% (రూ.41 వేలు) లబ్ధిదారుని వాటా పోగా దాదాపు రూ.11 లక్షల మేర రుణాన్ని నెలకు రూ.22 వేల చొప్పున ఐదేళ్లలో చెల్లించాలి. చిన్న తరహా స్వయం ఉపాధి యూనిట్లకు రూ.2 నుంచి 10 లక్షలు, అంతకుమించి కూడా అప్పులిచ్చారు. వీరిలో చాలామంది గడువు తీరినా బకాయిలు చెల్లించలేదు. మొదటి వాయిదా కూడా చెల్లించనివారూ భారీగానే ఉన్నారు.
బకాయిల వసూలుపై ఉన్నతాధికారులు వారం వారం సమీక్ష నిర్వహిస్తున్నారు. వసూలుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రుణాలు చెల్లించని లబ్ధిదారులకు నోటీసులిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మూడు విడతల నోటీసులు జారీ చేశారు. ఎంతకీ బకాయి చెల్లించని లబ్ధిదారులకు సంబంధించి రుణం మంజూరు సమయంలో హామీ (ష్యూరిటీ) ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు సైతం నోటీసులు పంపుతున్నారు. లబ్ధిదారులతో రుణాన్ని కట్టించాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నారు.
కొన్ని జిల్లాల్లో రుణ లబ్ధిదారులతో ప్రత్యేక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో రూ.13 కోట్లు, విజయనగరంలో రూ.6.23 కోట్లు, అనంతపురంలో రూ.2.2 కోట్ల బకాయిలున్నాయి. ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో రూ.1.49 కోట్లు, గుంటూరులో రూ.కోటి, అనంతపురం జిల్లాలో రూ.43 లక్షలు వసూలు చేశారు. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది.
ఇదీ చదవండి: