కరోనా కొత్తరకం వైరస్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రానికి గత నెల రోజులగా 1148 మంది యూకే నుంచి వచ్చారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇందులో 1040 మందిని ఇప్పటికే గుర్తించమని వెల్లడించింది. వీరిలో 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని.. మరో 90 మంది ఇచ్చిన చిరునామాలు సరిపోలడం లేదని తెలిపింది.
982 మందిని గుర్తించి వారిని క్వారంటైన్‌కు పంపించామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఈ 982 మందిలో నలుగురికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని వెల్లడించింది. మిగిలిన వారి నుంచి కూడా నమూనాలు తీసి సీసీఎంబీ, ఎన్ఐవీ పూణెకు పరీక్ష నిమిత్తం పంపినట్టు ఆరోగ్య శాఖ తెలియజేసింది.
కొత్త రకం కరోనా వైరస్ వేరియంట్ ఆనవాళ్ల కోసం పరీక్షలు నిరహిస్తున్నామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఫలితాలు రావడానికి మరో మూడు రోజుల సమయం పడుతుందని స్పష్టం చేసింది. ప్రజలెవరూ ఈ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు.
ఈ నెల 28 నుంచి కృష్ణాజిల్లాలో ఆరు ప్రాంతాలలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకే కృష్ణాజిల్లాలో ఈ డ్రైరన్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఈ నెల 28న ఏపీలో కరోనా టీకా డ్రై రన్