ప్రీమియం ధరకు బొగ్గు కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని ఏపీ జెన్‌కో ఉపసంహరించుకుంది. సింగరేణి కాలరీస్‌తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో ఆ ప్రభావం బొగ్గు వినియోగంపై పడింది. కోటా ప్రకారం నోటిఫైడ్ ధరకు కేటాయించిన బొగ్గునే తీసుకుంటోంది. ప్రస్తుతం డిమాండు తగ్గడంతో నోటిఫైడ్ ధరకే అదనపు బొగ్గును సరఫరా చేయడానికి సింగరేణి కాలరీస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. జెన్‌కో పరిధిలో 5వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన థర్మల్ యూనిట్లున్నాయి. 80 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) ప్రకారం 26 లక్షల టన్నుల బొగ్గును కేంద్రం కేటాయించింది.
జెన్‌కో ఒక్కో టన్ను బొగ్గును మహానది కోల్ మైన్స్ నుంచి రూ.1,967కు, సింగరేణి కాలరీస్ నుంచి రూ.2,350 చొప్పున నోటిఫైడ్ ధరకు కొనుగోలు చేస్తోంది. కోటాకు మించి బొగ్గు అవసరమైతే 20 శాతం ప్రీమియం ధరకు కొనాలి. దీనికి జీఎస్టీ, ఇతర పన్నులు కలిపితే నోటిఫైడ్ ధర కంటే టన్నుకు రూ.900 అదనంగా చెల్లించాలి. ఏటా సుమారు 2-3 లక్షల టన్నుల బొగ్గును ప్రీమియం ధరకు కొనాలంటే సుమారు రూ.20 కోట్ల భారం పడుతోంది.
ఇదీ చూడండి..