కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశే ఎదురైందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. విభజన హామీలు పెండింగ్‌లో ఉండటం.. రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితి అని తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు హక్కు అని పేర్కొన్నారు. కానీ అలాంటి అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ లేదని విచారం వ్యక్తం చేశారు. రెవెన్యూ లోటు భర్తీ చేయాలని కోరామని... కానీ ఎలాంటి భరోసా లేదన్నారు. రామాయపట్నం ప్రాజెక్టుతో పాటు పోలవరం ప్రాజెక్టుపై కూడా ఎలాంటి హామీ లేదని వెల్లడించారు. రాష్ట్రంలో మొదలు పెట్టిన విద్యా సంస్థలకు నిధులు రావాల్సి ఉందని తెలిపారు.
10శాతం పెరుగుదల ప్రశ్నార్థకమే..
జీడీపీలో 10 శాతం పెరుగుదల అంచనా ప్రశ్నార్థకమే అని బుగ్గన అన్నారు. బడ్జెట్‌లో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చూపిస్తున్నారని..పెట్టుబడుల ఉపసంహరణతో రూ. 2.1 లక్షల కోట్ల ఆదాయం ఎలా సాధ్యమని లేవనెత్తారు. పద్దులో అప్పులు ఎక్కడి నుంచి తెస్తారో సరిగా చెప్పలేదని తెలిపారు. వ్యవసాయ గోదాముల సామర్థ్యం పెంచేందుకు అప్పు మంచిదేనని పేర్కొన్నారు. వ్యాపార వృద్ధికి కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయని ప్రశంసించారు.
కేంద్రాన్ని ప్రశ్నించండి...
తెదేపా నేతలపై ఆర్థిక మంత్రి బుగ్గన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని అడగాల్సిందిపోయి...రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. తుగ్లక్ పాలనలో రాష్ట్ర అన్ని విధాలా నాశనమైపోయిందంటున్నారని...తెదేపా పాలనే తుగ్లక్ పాలనను తలపించిందంటూ మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే... అభివృద్ధితో పాటు అధికార వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పారు. న్యాయపరమైన అంశాలకు సంబంధించే వ్యవస్థలన్నింటినీ కర్నూలులోనే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి : రాష్ట్రం ఆశించినవి కేంద్ర బడ్జెట్‌లో కనిపించాయి: వైకాపా ఎంపీ