AP Employees JAC Leaders On PRC: ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది. తమ డిమాండ్ల పరిష్కారానికి అనుసరించే విధానంపై భేటీలో చర్చించారు. భేటీ అనంతరం ఏపీజేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. అధికారులతో తమకు ఎలాంటి న్యాయమూ జరగడం లేదన్న ఆయన.. ఇకపై సీఎంతోనే చర్చిస్తామని స్పష్టం చేశారు.
ఈ నెల 9న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఉందని, అదేరోజు జిల్లా స్థాయి నేతలతో విస్తృతస్థాయి సమావేశం జరుపుతామని చెప్పారు. సమావేశం అనంతరం పోరాట కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఈలోగా తమ సమస్యలను సీఎం పరిష్కరిస్తారని ఆశిస్తున్నామన్నారు. తాము ఫ్రెండ్లీ ప్రభుత్వంగానే భావిస్తున్నామని.. కానీ ప్రభుత్వం మాత్రం తమపై వివక్ష చూపిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
"అధికారులతో మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఇకపై సీఎంతోనే చర్చిస్తామనిఅధికారులకు స్పష్టం చేశాం. ఈ నెల 9న జిల్లాస్థాయి నేతలతో విస్తృతస్థాయి భేటీ ఉంటుంది. సమావేశం అనంతరం పోరాట కార్యాచరణ ప్రకటిస్తాం. ఈలోగా మా సమస్యలను సీఎం పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం" - బండి శ్రీనివాస్, ఏపీజేఏసీ ఛైర్మన్
వారే అడ్డుకుంటున్నారు - బొప్పరాజు
తమ డిమాండ్లపై.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు అన్నారు. పీఆర్సీ డిమాండ్ వల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారమూ పడదని చెప్పారు. తమను సీఎం వద్దకు వెళ్లకుండా సజ్జల, బుగ్గన, సీఎస్ అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
"71 డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వం ముందుంచాం. ఏ డిమాండ్‌పైనా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం కనీసం మాట కూడా చెప్పలేదు. సీఎం వద్దకు వెళ్లకుండా సజ్జల, బుగ్గన, సీఎస్ అడ్డుకుంటున్నారు. మా పీఆర్‌సీ డిమాండ్ వల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదు" - బొప్పరాజు వెంకటేశ్వర్లు, అమరావతి జేఏసీ
ఇదీ చదవండి
TDP Strategy Meeting: మరింతగా ఉద్యమించండి.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు నిర్దేశం