కరోనా వైరస్ నియంత్రణకు మే 3 వరకూ లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. డీజీపీతో కలిసి జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. గ్రీన్ జోన్లు రెడ్ జోన్లుగా మారకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా ఈనెల 20వ తేదీ నుంచి కొన్ని మినహాయింపులతో గ్రీన్ జోన్లలో కార్యకలాపాలు జరిగేలా అనుమతులు ఇస్తామని తెలిపారు.
లాక్ డౌన్ కాలంలో ఎటువంటి ప్రజారవాణా వ్యవస్థకు అనుమతి లేదని సీఎస్ స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు, సినిమా థియేటర్లు, సాంస్కృతిక, క్రీడా కేంద్రాలు, మతపరమైన సంస్థలు వంటివన్నీ మూసివేయాలని చెప్పారు. అన్ని పబ్లిక్ స్థలాల్లో ప్రతి ఒక్కరూ విధిగా ముఖాన్ని కవర్ చేసేలా మాస్క్‌లు వంటివి ధరించేలా చూడాలని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుమిగూడకుండా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్ సూచించారు. పబ్లిక్ స్థలాల్లో ఎవ్వరూ ఉమ్మి వేయకుండా చూడాలని చెప్పారు.
మరోవైపు లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడంతో పాటు ఎవరికీ ఈ వైరస్ సోకకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే కేసులు నమోదు అయ్యాయని.. గ్రామీణ ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు అనవసర రాకపోకలను నియంత్రించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి :