ఎస్ఈసీ నీలం సాహ్నితో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశమయ్యారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నిని సీఎస్ అభినందనలు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు, భద్రత, పోలింగ్ తేదీపై సమావేశంలో చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం ఎస్ఈసీ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. సమావేశానికి ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై గవర్నర్‌తో ఎస్ఈసీ చర్చించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఇవాళ సాయంత్రం 4గంటలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీ పాల్గొని ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం ఎస్‌ఈసీ ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశముంది. పరిషత్ ఎన్నికలకు గతేడాది మార్చి 7న నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొవిడ్ ఉగ్రరూపం దాల్చింది. దీంతో మార్చి 15వ తేదీన అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిషత్ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్నికలను తిరిగి కొనసాగించాలని నీలం సాహ్ని నిర్ణయించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తూ సాయంత్రం ప్రకటన విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్