రాబోయే కాలంలో కరోనా రానివారు ఎవరూ ఉండరేమోనని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అది వస్తుంది, పోతుందని చెప్పారు. దాంతో కలిసి జీవించాల్సి ఉంటుందన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో భయాన్ని తొలగించి.. అవగాహన, చైతన్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. కంటెయిన్‌మెంట్ క్లస్టర్ల పరిధిని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్లాలని తెలిపారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో దృశ్యశ్రవణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నివారణలో కలెక్టర్లు, ఎస్పీలు అద్భుతంగా పనిచేశారని.. వారే తన బలమన్నారు. ఆయన ఏమన్నారంటే..
చివరిదశలో వస్తే కాపాడటం కష్టం..
* దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వైరస్ సోకగానే ఆసుపత్రికి వస్తే మరణాలు లేకుండా చూడగలం. కానీ వారు భయంతో బయటకు చెప్పుకోలేక, చివరిదశలో ఆసుపత్రికి వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడటం కష్టమవుతోంది.
* ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకునేలా, వారి ఆరోగ్యం గురించి వారే చెప్పేలా ప్రోత్సహించాలి. రోగ నిర్ధారణ పరీక్షలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. దీని కోసం ఎవర్ని సంప్రదించాలి? పరీక్షలు ఎలా చేయించుకోవాలనే అంశంపై అవగాహన కల్పించాలి.
* వైఎస్‌ఆర్ గ్రామ, వార్డు క్లినిక్స్ నిర్మాణాన్ని కలెక్టర్లు ప్రథమ బాధ్యతగా భావించాలి. కరోనా సోకిందనే అనుమానం ఉన్నవారు అక్కడికి వెళ్లి పరీక్షలు చేయించుకుని మందులు తీసుకునే ప్రక్రియ సాఫీగా సాగిపోవాలి. పరీక్షల సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లాలి.
* గ్రామస్థాయిలో విత్తనాల పంపిణీ కోసం రైతులకు కూపన్లు ఇచ్చే వ్యవస్థను కలెక్టర్లు పర్యవేక్షించాలి. ఉదయం 6-10, సాయంత్రం 4-7 గంటల మధ్య విత్తనాల పంపిణీ జరగాలి.
* నకిలీ విత్తనాలు, పురుగుమందుల విషయంలో అధికారులు దూకుడుగా వ్యవహరించాలి. కలెక్టర్లు, ఎస్పీలు దీనిపై దృష్టిసారించాలి.
* జూన్ 1 నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే ఎరువులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఎంతమేర అవసరమో ముందే గుర్తించాలి.
* జిల్లా, మండలస్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లు వెంటనే ఏర్పాటుచేయాలి. మార్గదర్శకాలు రేపటికి ఇస్తాం.
* పక్క రాష్ట్రాల్లో మద్యాన్ని ఎలా తాగించాలని ఆలోచిస్తుంటే.. మనం ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్నాం.
* వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు తిరిగొచ్చిన వలస కూలీలు అందరికీ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు ఇచ్చి పనులు కల్పించాలి.
* వేసవిలో తాగునీటి సమస్య రాకుండా కలెక్టర్లు రోజూ పర్యవేక్షించాలి.
* ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీ, అక్రమ రవాణా జరగకూడదు. వీటి వెనుక ఎవరున్నా లెక్క చేయొద్దు. సీసీటీవీ కెమెరాలు, చెక్‌పోస్టులు పనిచేయాలి.
* ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తాం. జులై నెలాఖరు లోగా 15,715 పాఠశాలల్లో నాడు-నేడు తొలివిడత పనులు పూర్తిచేయాలి.
* పేదల ఇళ్ల పట్టాల లబ్ధిదారుల తుది జాబితాను జూన్ 7న ప్రకటించాలి.
* వచ్చే సంవత్సరం నుంచి గ్రామాల్లో జనతా బజార్లు కనిపిస్తాయి.
రాబోయే 2, 3 రోజుల్లో ప్రజా రవాణా ప్రారంభమవుతుంది. షాపింగ్ మాల్స్, సినిమాహాళ్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులకు అనుమతి లేదు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభమవుతాయి. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతికదూరం పాటించాలి. రాష్ట్రంలో ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభమవుతాయి. - ముఖ్యమంత్రి జగన్
ఇదీ చదవండి :
తెలంగాణ ప్రాజెక్టులపై కృష్ణా, గోదావరి బోర్డులకు ఏపీ ఫిర్యాదు